జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికార పిడిపి పార్టీ మొదటి నుంచి కూడా వేర్పాటువాదులకి, ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తోందనేది రహస్యమేమీ కాదు. హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని పొరపాటున ఎన్కౌంటర్ చేయబడ్డాడని, అందుకు చింతిస్తున్నామన్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాహబూబా ముఫ్తీ చెప్పడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆమె కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లని అదుపు చేయలేక డిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చలు జరుపుతుంటే, ఆమె పార్టీకే చెందిన ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మద్ షా కూడా బుర్హాన్ వనీ ఉగ్రవాది కాదు. అతనొక కాశ్మీరీ స్వాతంత్ర్య పోరాట యోధుడు. కాశ్మీర్ లో చిరకాలంగా కొనసాగుతున్న అణచివేతకి, వేధింపులకి కారణంగా ఉద్యమకారుడిగా మారాడని చెప్పడం విశేషం. అందుకే కాశ్మీరీ ప్రజలు తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారని ముస్తాక్ అహ్మద్ షా చెప్పారు. కాశ్మీరులో బుర్హాన్ వనీ స్వంత ఊరు త్రాల్ కి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనకి వనీ గురించి బాగా తెలుసని, అతను ఉగ్రవాది కాదని దైవభక్తుడని చెప్పారు. కాశ్మీర్ సమస్యపై పోరాడుతున్న బుర్హాన్ వనీ తన మరణంతో ఆ పోరాటాలకి మళ్ళీ జీవం పోశాడని అన్నారు.
కాశ్మీర్ సమస్యల గురించి ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకే బాగా తెలుస్తుంది కనుక బుర్హాన్ వనీ గురించి ముస్తాక్ అహ్మద్ షా చెప్పిన మాటలు నిజమే అనుకొన్నా, అతను వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ఆశ్రయించినందుకే అతనికి ఆ గతి పట్టింది. ఒకవేళ అతను భారత సార్వభౌమత్వం, రాజ్యాంగం, చట్టాలకి లోబడి కాశ్మీర్ సమస్యలని పరిష్కరించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా కృషి చేసి ఉండి ఉంటే, నేడు అతను కూడా ముస్తాక్ అహ్మద్ షా లాగనే ఒక ప్రజాప్రతినిధిగా మన కళ్ళ ముందుండేవాడు. కానీ భారత వ్యతిరేక, చట్టవ్యతిరేక మార్గాన్ని ఎంచుకొని తుపాకీ చేత పట్టుకోవడం వలన చివరికి దానికే బలయ్యాడు.
అటువంటి వ్యక్తిని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమర్ధిస్తూ మాట్లాడటం ఇంకా తప్పు. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగినప్పటి నుంచి తన త్రాల్ నియోజక వర్గంలో అడుగుపెట్టలేకపోతున్నానని ముస్తాక్ అహ్మద్ షా చెప్పడం గమనిస్తే, అందుకే అతను బుర్హాన్ వనీకి అనుకూలంగా మాట్లాడినట్లు అర్ధం అవుతోంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈవిధంగా తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులకి, వేర్పాటువాదులకి మద్దతు ఇస్తునంత కాలం కాశ్మీర్ లో సమస్య పరిష్కారం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.