చిన్న సినిమాకి కొత్త స్థాయినిచ్చిన సినిమా… బొమ్మరిల్లు. దశాబ్దకాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్ని లెక్కేస్తే… కచ్చితంగా బొమ్మరిల్లు తొలి స్థానాన్ని ఆక్రమించుకొంటుంది. ఇలాంటి ఓ క్లాసిక్ వచ్చి… నేటికి సరిగ్గా పదేళ్లు. బొమ్మరిల్లు వచ్చి పదేళ్లయినా.. ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్ ఇంకా మన దర్శక నిర్మాతలపై చాలా ఉంది. నిన్నటికి నిన్న చిరంజీవి కూడా.. ‘బొమ్మరిల్లు లాంటి మంచి సినిమా ఇది’ అంటూ శ్రీరస్తు శుభమస్తుని ప్రస్తావించారంటే… బొమ్మరిల్లుకు ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతోంది. ఓ సున్నితమైన ప్రేమకథకు, తండ్రీ కొడుకుల పాయింట్‌ని మేళవించి, ఆధ్యంతం ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దిన న వైనం.. నిజంగా అద్భుతః
ఈ సినిమాతో దిల్ రాజు బ్యానర్‌కి ఉన్న విలువ పది రెట్లు పెరిగింది. భాస్కర్… బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. హాసిని జెనీలియాతో ఓ మంచి కథానాయిక దొరికిందని చిత్రసీమ సంబరపడింది. సిద్దార్థ్ కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లిపోయిందీ చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అబ్బూరి రవి మాటలు.. ఆఖర్లో `అంతా మీరే చేశారు నాన్న` డైలాగ్ ఎప్పటికీ గుర్తిండిపోతాయి. కథానాయిక పాత్ర చిత్రణ తీరు… క్లైమాక్స్ సన్నివేశం ఈ చిత్రానికి ప్రత్యేకత తీసుకొచ్చాయి. ఎండ్ టైటిల్స్‌లోనూ ఓ కథ నడపడం అనే ట్రెండ్ ఈ సినిమాతోనూ మొదలైంది. బొమ్మరిల్లు ప్రభావం రెండు మూడేళ్ల పాటు కనిపిస్తూనే ఉంది. బొమ్మరిల్లు లాంటి నాన్నో, హాసిన పాత్రో సృష్టించాలని దర్శక నిర్మాతలు తెగ తాపత్రయ పడ్డారు. కానీ.. ఫలితం మాత్రం రాలేదు. అద్భుతం అనేది ఒక్కసారే జరుగుతుంది. అది బొమ్మరిల్లుతో జరిగిపోయింది. దాన్ని రిపీట్ చేయడం కష్టం. త్వరలోనే బొమ్మరిల్లు 2 రాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. బొమ్మరిల్లు మీటర్‌ని దాటడం.. ఆ సినిమాకీ అసాధ్యమేనేమో??