ఏపికి ప్రత్యేక హోదాపై సోమవారం లోక్ సభలో జరిగిన చర్చలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ త్వరలో ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకొంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు తుది దశకి చేరుకొన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదాకి బదులు ఆర్ధిక ప్యాకేజి ఇవ్వబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. ప్రత్యేక హోదా తప్ప దానికి ప్రత్యామ్నాయంగా మరేదీ తాము అంగీకరించబోమని వైసిపి ఎంపిలు స్పష్టం చేశారు. కనుక ఏపికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా ఆర్ధిక ప్యాకేజ్ ఇస్తారా?అనే విషయం త్వరలో తేలిపోతుందని అర్ధమవుతోంది.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి హడావుడిగా డిల్లీ చేరుకొని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ఏపి సిఎం చంద్రబాబుకి ప్రత్యేక హోదా సాధించాలనే ఆసక్తి తపన లేదంటూ విమర్శలు గుప్పించారు. తరువాత డిల్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులని కూడా కలిసి ప్రత్యేక హోదా కోసం మద్దతు కోరబోతున్నారు.
అయితే రెండేళ్ళు ఆగిన జగన్ మరికొన్ని రోజులు ఆగకుండా హడావుడిగా డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, డిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలని కలవవలసిన అవసరం ఏమిటి? డిల్లీలో మీడియాని పిలిచి చంద్రబాబు నాయుడుని తిట్టవలసిన అవసరం ఏమిటి? తద్వారా ఆయన ఏమి సాధించదలచుకొన్నారు? అంటే చంద్రబాబు చేస్తున్న ఒత్తిడి కారణంగా కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోతోందనే అనుమానంతోనే ఆయన హడావుడిగా డిల్లీలో వాలిపోయారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చాల హుషారుగా మాట్లాడారు. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి ఏదో రాబోతోందన్నట్లుగానే చాలా సంతోషంగా మాట్లాడారు. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా అదే చెపుతున్నారు కనుక బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డి హడావుడిగా డిల్లీలో వాలిపోయుండవచ్చు. ఒకవేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే, అది తన కృషి, వైసిపి ఎంపిల ఒత్తిడి వలననే లభించింది తప్ప చంద్రబాబు కారణంగా కాదని చెప్పుకొని, ఆ క్రెడిట్ స్వంతం చేసుకోవడానికే జగన్ డిల్లీలో వాలిపోయారేమో? దానిపై క్రెడిట్ ఎవరు క్లెయిం చేసుకొన్నా రాష్ట్ర ప్రజలకి అభ్యంతరం ఉండదు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చిత్తశుద్ధితో కృషి చేసి దానిని సాధిస్తే చాలా సంతోషిస్తారు.