ఏపి సిఎం చంద్రబాబు నాయుడిపై ద్వేషంతో జగన్ మాట్లాడుతున్న మాటలు వింటే ఆయన చంద్రబాబుని ద్వేషిస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ద్వేషిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంటుంది. ఆయన మనసాక్షి పత్రికలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన డిల్లీలో మీడియాతో అన్న మాటలు వింటే అదే అభిప్రాయం కలుగక మానదు. ఆయన ఏమన్నారంటే, “జి.ఎస్.టి.బిల్లు అమలులోకి వస్తే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రప్రభుత్వం చేతికే వెళ్లిపోతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు కూడా ఇంకా క్షీణిస్తాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. రాష్ట్రాన్ని రక్షించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదు. కనుక దానిని సాధించేవరకు మేము పోరాటాలు చేస్తాము. థాంక్స్ టు జి.ఎస్.టి.” అని అన్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుందంటే దాని ప్రభావం తెలుసుకోలేని సామాన్య పౌరులు కూడా చాలా ఆందోళన చెందుతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా దాని వలన తన పోరాటాలు కొనసాగించేందుకు మంచి అవకాశం లభించింది అన్నట్లుగా మాట్లాడటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన మాటలు వింటే ప్రత్యేక హోదా సాధించాలనే తపన కంటే దాని కోసం నిరంతరం పోరాటాలు చేయాలనే తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోంది. “స్వాతంత్ర్యం రావడానికే 100 సం.లు పట్టింది. ఇక ప్రత్యేక హోదాకి ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికి తెలుసు? అంతవరకు పోరాటాలు చేస్తాము,” అన్న జగన్ మాటలే ఆయన మనసులో ఆలోచనలని పట్టిస్తాయి.
జి.ఎస్.టి. వలన రాష్ట్రం నష్టపోతే అందుకు ఎవరైనా బాధపడతారు కానీ జగన్ మాత్రం థాంక్స్ చెపుతున్నారు. దాని వలన ప్రత్యేక హోదా ఇవ్వక తప్పనిసరి పరిస్థితులు వస్తాయని చెపుతూనే, మళ్ళీ దాని కోసం ఎన్నేళ్ళయినా పోరాటం కొనసాగిస్తామని చెప్పడానికి అర్ధం ఏమిటి? అంటే ఏదో ఒక బలమైన కారణంతో చంద్రబాబు నాయుడుపై పోరాటాలు కొనసాగించాలానే తాపత్రయమే అందులో కనబడుతోంది.