ఇదేం తీరు అంటూ సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకుంటారు.. ఇంకాస్త నోరున్న వాళ్లు సోషల్ మీడియాకు ఎక్కి తిడతారు! ఈ తీరును కూడా ఎంజాయ్ చేసే వాళ్లు చేస్తారు.. ఎవరు ఏమనుకుంటే ఏం, ఏమైతేనేం.. అంతిమంగా ఆ కార్యక్రమం గురించి అంతా చర్చించుకుంటారు. ఆ ఛానల్ లో అలాంటి కార్యక్రమం ఒకటి వస్తోందని అందరూ గుర్తిస్తారు! దాన్ని తిట్టడానికే కొంతమంది చూస్తారు.. దానిలోని వికారాన్ని చూసి అసహ్యించుకోవడానికి ఇంకొందరు దాన్ని వీక్షిస్తారు!
ఇదే టీవీ 9 విజయరహస్యం. ఆ టీవీ ఛానల్ లో ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం గురించి ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇస్తూ అందులో ఇంటర్వ్యూలు సాగుతున్నాయని.. ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసే ఆ టీవీ జర్నలిస్టు తీరు సరిగా లేదని.. తనకు తోచిన అసంబద్ధమైన ప్రశ్నలతో జర్నలిజం స్థాయినే అతడు దిగజారుస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.
మరి అందరికీ నీతులు చెప్పే ఆ టీవీ ఛానల్ ఇప్పుడు ఈ విమర్శలకు విలువనిస్తుందా? ఇకపై అయినా ఆ కార్యక్రమ హోస్టు ప్రవర్తనలో తేడా వస్తుందా? అనే సంగతుల గురించి ఆలోచించనే అక్కర్లేదు. ఎందుకంటే.. నీతులు చెప్పేది ఊర్లో వాళ్ల కు కానీ పాటించడానికి కాదు. ఇప్పుడు టీవీ 9 కూడా అందుకు మినహాయింపు కాకపోవచ్చు. జర్నలిజం .. విలువలు.. ఇవన్నీ కుదిరే పని కాదు. జర్నలిజం అంటే.. జనాలను ఎంటర్ టైన్ చేయడం అని అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా.. జనాలు మాట్లాడుకోవడానికి ఏదో మసాలా అందించడమే ఇప్పట్లో టీవీ ఛానళ్లు చేస్తున్న పని. కాబట్టి.. అది ఎంత వివాదాస్పదం అయినా.. ఆ ఛానల్ ప్రసారాల గురించి జనాలు మాట్లాడుకుంటే చాలు. ఎవరికి తోచింది వారు మాట్లాడటం.. ఓవరాల్ గా తమ గురించి మాట్లాడుకునేలా చూడటమే వ్యాపార రహస్యం!