నూటా ఇరవై కోట్ల జనాభా. 118 మంది క్రీడాకారులు. రియో ఒలింపిక్స్ లో ఇంత మందీ ఏం చేస్తున్నారని ఇప్పుడు భారతీయులకు అసహనం కలుగుతోంది. పతకాల వేల మొదలై మూడు రోజులు గడిచిపోయినా మనోళ్లు బోణీ కొట్టలేదు. టెన్నిస్ స్టార్లు నిరాశ పరిచారు. ఓ పక్క చిన్న చిన్న దేశాలు పతకాలు సాధిస్తున్నాయి. ఇంత పెద్ద దేశం ఒక్క పతకమైనా సాధిస్తుందా అని సగటు భారతీయుడి ప్రశ్న. ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ కూడా సగటు భారతీయుడిలాగే బాధపడ్డారు. మన క్రీడాకారుల వైఫల్యంపై అసహనం వ్యక్తం చేశారు. మన క్రీడా పాలసీని సమీక్షించాలని సూచించారు. మనోళ్లను రియో పంపడం డబ్బు వృథా అని ప్రముఖ రచయిత్రి శోభా డే సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
భారత్ నుంచి క్రీడాకారుల సంఖ్య సెంచరీ దాటింది. 118 మందిని రియో పంపాం. కానీ ఏం లాభం. టెన్నిస్ స్టార్ లియాండ్ పేస్, బోపన్నల జోడీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. ఎడమొహం పెడమొహంగా వాళ్ల ఈగో వల్ల దేశం మూల్యం చెల్లించింది. ఒక హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా జోడీ కూడా మహిళల డబుల్స్ లో తొలి రౌండ్ లోనే ఓటమి పాలైంది. బీజింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా స్వల్పతేడాతో పతకాన్ని చేజార్చుకుని నిరాశ పరిచాడు. రియోలో భారత పతాక ధారి అయిన బింద్రా, పతకాన్ని గెలవకుండానే ఇంటిముఖం పట్టాడు.
హాకీలో పురుషుల జట్టు ఇర్లండ్ పై తొలి మ్యాచ్ లో నెగ్గినా, ఆ తర్వాత జర్మనీ చేతిలో ఓడిపోయింది. మహిళల జట్టు జపాన్ తో డ్రా చేసింది. బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్, జిమ్నాస్టిక్స్ లో దీపా కర్మాకర్, రెజ్లింగ్ లో నర్సింగ్ యాదవ్ వంటి వారిపై భారీగానే అంచనాలున్నాయి.
ఎంత మంది వెళ్లారనేది కాదు. ఎన్ని విజయాలు సాధించారనేది గమనిస్తే చిన్న చిన్న దేశాల విజయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మనకు సమీపంలో ఉన్న థాయ్ లాండ్ అప్పుడే 2 స్వర్ణ పతకాలు, ఒక్కో రజత, కాంస్య పతకం సాధించింది. 9వ స్థానంలో నిలిచింది. వియత్నాం కూడా స్వర్ణ పతకాన్ని సాధించి సత్తా చాటింది. చిన్న దేశం మంగోలియా ఇప్పటికే ఓ రజత పతకం గెల్చుకుంది. నిరంకుశ పాలనలో అస్తవ్యస్త దేశంగా మారిన ఉత్తర కొరియా కూడా అందరినీ ఆశ్చర్య పరిచింది. మూడు రోజుల్లోనే ఒక రజత పతకం సాధించింది.
చిన్న దేశాలు, పేద దేశాలు ఉత్సాహంగా పతకాల వేట సాగిస్తుంటే భారత్ మాత్రం ఇంకా బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఈసారి రెండంకెల సంఖ్యలో పతకాలు వస్తాయని అంతా ఆశించారు. కనీసం లండన్ లో వచ్చిన ఆరు పతకాలు వస్తే చాలు, లేదా కనీసం ఒక్కటి వస్తే చాలని అనుకునే పరిస్థితి వచ్చేసింది.