మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆందోళన బాట పట్టాయి. చాలా మంది రైతులు కూడా ధర్నాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం విపక్షాలపై మండిపడింది. రైతులకు అద్భుతమైన పరిహారం ప్యాకేజీ ఇస్తుంటే ప్రతిక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించాయి.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 123 జీవోను మొన్న హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ప్రభుత్వం హైరానా పడింది. లోపాలను సవరించడానికి చర్యలు తీసుకుంది. రైతు కూలీలు, చేతి వృత్తుల వారిని ఆదుకుంటామని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం కల్లా జీవోను విడుదల చేసి, దాని కాపీని తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. భూసేకరణ మాత్రం తుది తీర్పుకి లోబడే ఉండాలని స్పష్టం చేసింది. జీవో 123ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
ఇప్పుడు ప్రభుత్వం తమ మాటే నెగ్గిందని విపక్షాలపై విరుచుకు పడే అవకాశం ఉందా అనేది ప్రశ్న. జీవోలో లోపాలున్నాయనే విపక్షాల మాట నిజమైంది. ఇవాళ హైకోర్టు ఉత్తర్వుల్లోనూ ఆ జీవోను సమర్థించలేదు.
అదనపు అంశాలను చేరుస్తూ జీవో జారీ చేయాలని ఆదేశించింది. అంటే పాత జీవోలో లోపాలున్న మాట వాస్తవమని విపక్షాలు అంటున్నాయి. తాము ఆందోళన చేసినప్పుడు విమర్శించిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తుందని ప్రశ్నిస్తున్నాయి. అయితే, విపక్షాలు తెలిపిన అభ్యంతరాలన్నీ నిజం కాదని హైకోర్టు తాజా తీర్పుతో తేలిపోయిందనేది తెరాస నేతల వాదన.
వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా, నష్టపోయే వారికి తగిన పరిహారం, సహాయం అందడం ముఖ్యం. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి. కీలకమైన విషయాలను విస్మరించి జీవోలను జారీచేస్తే చెల్లదని ఈ విషయంలో స్పష్టమైంది. కేసీఆర్ ప్రభుత్వం పంతానికి పోయి 2013 చట్టాన్ని అమలు చేయకుండా మొండికేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఆ చట్టం స్ఫూర్తికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తోందనే వాదన వినవస్తోంది. మొత్తానికి రైతు కూలీలు, చేతివృత్తుల వారికి అన్యాయం జరగకుండా హైకోర్టు అండగా నిలిచింది. పిటిషన్ దాఖలు చేసిన మెదక్ జిల్లా వారికి ఇది అసలైన విజయం.