ఓ సినిమా ఫలితం తిరగబడితే వెంటనే దర్శక నిర్మాతలు మళ్లీ రంగంలోకి దిగిపోయి, ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సినిమాని మళ్లీ ఎడిట్ చేసి, బోరింగ్ సీన్లు లేపేసి నానా హడావుడి చేస్తారు. ”మా సినిమాలో 20 నిమిషాలు తగ్గించాం.. ఇప్పుడు బాగుంది కావాలంటే చూడండి” అంటూ… మళ్లీ ప్రెస్ మీట్లలో గగ్గోలు పెట్టిస్తారు. సినిమాకి కాస్త పాజిటీవ్ స్పందన వచ్చినా తొలగించిన సీన్లు కలుపుతుంటారు. ఇప్పుడు శ్రీరస్తు – శుభమస్తు సినిమాలో అదే జరిగింది. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ యావరేజ్‌గా ఉన్నా, వసూళ్లు బాగున్నాయి. దాంతో చిత్రబృందానికి కొత్త ఉత్సాహం వచ్చినట్టైంది. సినిమా నిడివి తగ్గించాలన్న తాపత్రయంతో విడుదలకు ముందు కొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేశారు. సెకండాఫ్‌లో అలీపై తెరకెక్కించిన సీన్లు కత్తిరించారు. ఇప్పుడు వాటిని కలుపుతున్నట్టు టాక్.
గురువారం నుంచి.. కొత్త సీన్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అలీ సీన్లు కలపడం వల్ల కొత్తగా టికెట్లు తెగకపోయినా.. కొత్తగా సినిమా చూసేవాళ్లకు మాత్రం ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుందని చిత్రబృందం ఆశలు పెట్టుకొంది. అన్నట్టు శ్రీరస్తు – శుభమస్తు థ్యాంక్స్ మీట్ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికంటే ఎక్కువగా సంతోషంగా కనిపించింది బన్నీనే. ”మా తమ్ముడు హిట్ కొట్టాడు. నేను చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది దాని కోసమే” అని సంతోషంగా చెప్పాడు బన్నీ.