ప్రత్యేక హోదా కోసం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రతిపక్ష పార్టీల నేతలని కలవడాన్ని తెదేపా నేతలు తప్పు పట్టవచ్చు కానీ అదేమీ తప్పు కాదు నేరమూ కాదు. ఆయన డిల్లీ పర్యటనలని అర్ధం చేసుకోవచ్చు కానీ అక్కడి నుంచి రుషికేశ్ వెళ్లి అక్కడ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలవడమే అనుమానాలకి తావిస్తోంది.
ఆధ్యాత్మిక చింతన, భగవరారాధనకే పరిమితం కావలసిన స్వామీజీలు రాజకీయనాయకులతో రాసుకుపూసుకు తిరుగుతుండటం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది కనుక స్వరూపానందేంద్ర స్వామి రాజకీయాల గురించి మాట్లాడినా, ముఖ్యమంత్రి చంద్రబాబుకి శాపనార్ధాలు పెట్టినా, అన్యమతస్తుడైన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినా పెద్ద విచిత్రమేమీ లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేదు కానీ వైకాపాకి, జగన్మోహన్ రెడ్డి మద్దతుగా చాలాసార్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు కనుక రుషికేశ్ లో ఆయన చేపట్టిన చాతుర్మాస దీక్షలో భాగంగా చేస్తున్న పూజలలో ప్రత్యేక హోదాని కూడా జోడించి దాని కోసం కూడా పూజలు, హోమాలు చేస్తున్నారుట! ఆ కార్యక్రమంలో పాల్గొనడానికే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ్ళ అక్కడికి వెళుతున్నారుట!
రాజకీయ నాయకులు హోమాలు చేస్తే విచిత్రం లేదు కానీ సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొనే స్వామీజీలు రాజకీయాలు చేస్తేనే చాలా విచిత్రంగా కనబడుతుంది. ప్రత్యేక హోదా కోసం స్వరూపానందేంద్ర స్వామి పూజలు చేయడం కూడా అలాగే ఉంది. అయితే అందులో పాల్గొనడానికే జగన్ వెళ్ళారనడం మాత్రం నమ్మశక్యంగా లేదు.
వారిరువురి మద్య ఏర్పడిన అనుబంధం గురించి అందరికీ తెలుసు. కృష్ణాపుష్కరాల కోసం విజయవాడలో ఆలయాల తొలగింపుపై అందరి కంటే ముందు వైకాపా స్పందించింది. ఆ తరువాత స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. ఆలయాల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మళ్ళీ ఆలయాలని యధాతధంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన పీఠాదిపతి కనుక ఆవిధంగా కోరడం సహజమే. కనుక అక్కడ ఆయనని వైకాపాతో ముడిపెట్టి చూడలేము. కానీ రుషికేశ్ లో వారిద్దరూ కలవడం మాత్రం రాజకీయ కోణంలో నుంచే చూడకతప్పదు. వారిరువురు లేదా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు లేదా వైకాపా భవిష్య కార్యాచరణలో గానీ రుషికేశ్ లో వారు ఎందుకు సమావేశం అయ్యారో బయటపడే అవకాశం ఉంది.