హైదరాబాద్: అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి భారీ తాయిలం ప్రకటించారు. రు.1.25 లక్షలకోట్ల ప్రత్యేక ప్యాకేజిని, బీహార్ మౌలికవసతుల అభివృద్ధికి మరో రు.40 వేలకోట్లను మంజూరుచేస్తున్నట్లు ఇవాళ బీహార్‌లోని ఆరాలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఈ ప్యాకేజిని పూర్తిగా వినియోగించేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్యాకేజిలతో బీహార్ దశ తిరుగుతుందని అన్నారు. బీహార్‌కు యూపీఏ ప్రభుత్వం రు.12,000 కోట్లుమాత్రమే ఇచ్చిందని, దానిలో రు.4,000కోట్లు మాత్రమే వినియోగమయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం బీహార్‌కు రెండు స్పెషల్ ప్యాకేజిలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాలను వినియోగించుకోలేకపోతోందని ఆరోపించారు. దేశంలో ఏదో ఒక భాగంమాత్రమే అభివృద్ధి చెందితే దేశం మొత్తం అభివృద్ధి చెందినట్లు కాదని తాను మొదటినుంచీ చెబుతున్నానని, ముఖ్యంగా తూర్పుభాగం అభివృద్ధి చెందాలని అన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.
విభజనవలన ఎంతో నష్టపోయామని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ నాయకులు ఎంతగా వేడుకుంటున్నా ప్రత్యేకహోదాకానీ, ప్యాకేజిగానీ ప్రకటించని నరేంద్రమోడి ప్రభుత్వం, ఎన్నికలు జరగబోతున్న బీహార్‌కుమాత్రం భారీ ప్యాకేజి ప్రకటించటంలో వారి ఉద్దేశ్యం ఏమిటో చిన్నపిల్లలకుకూడా అర్థమవుతూనే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్‌కుకూడా ఏమైనా ఇస్తే గిస్తే ఎన్నికలముందు ఏమైనా విదిలిస్తారేమో! అప్పటిదాకా – హోదా వస్తూ…ఉంది అనే టీడీపీ, బీజేపీ నేతల స్టేట్‌మెంట్‌లు, కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్ బంద్‌లు, పవన్ కళ్యాణ్ ట్వీట్‌లు భరించాల్సిందేనన్నమాట.