ఓ హీరో కమెడియన్ని పొగడడం.. అతని సలహా వల్లే బాగా నటించానని చెప్పుకోవడం విశేషమే. అది సదరు హీరోలోని సిన్సియారిటీకి నిదర్శనం. ఆ విషయంలో మార్కులు కొట్టేశాడు సాయిధరమ్ తేజ్. ఆయన నటించిన తాజా చిత్రం `తిక్క`. ఇందులో తాగి వాగే సన్నివేశాలు చాలా ఉన్నాయట. వాటిలోనటించడానికి తాగుబోతు రమేష్ సలహాలు తీసుకొన్నాడట సాయిధరమ్ తేజ్. ఈ విషయాన్ని తనే చెప్పుకొచ్చాడు. ”హ్యాంగోవర్ ప్రభావంతో ఓ కుర్రాడు వేసే తిక్క తిక్క వేషాలే.. ఈ సినిమా. ఇది వరకు సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో మాత్రమే.. ఆ తరహా సన్నివేశం ఒకటి చేశా. అయితే.. తిక్కలో సగం సినిమా తాగినట్టే యాక్ట్ చేయాలి. అందుకోసం తాగుబోతు రమేష్ సలహాలు తీసుకొన్నా. ఒక్క చుక్క మందు కూడా తాగకుండా.. తాగినట్టు భలే నటిస్తాడు రమేష్. అతనెలా బిహేవ్ చేస్తాడో, అందుకోసం ఏం చేస్తాడో తెలుసుకొన్నా. తన సలహాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి..” అంటున్నాడు సాయిధరమ్.
అంతేకాదు.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల సినిమాలు కూడా తెగ చూశాడట. అందులో మావయ్యలు తాగిన సన్నివేశాల్లో ఎలా నటించారో… గమనించాడట. ఆ ప్రభావం ఏమీ కనిపించకుండా తెరపై కొత్తగా నటించేందుకు ప్రయత్నించానని అంటున్నాడు. సునీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్లతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపుమీదున్న సాయికి.. తిక్క ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.