తెలంగాణా ప్రభుత్వం ఏపి సిఎమ్ చంద్రబాబుతో సహా ఆయన మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణా రాజకీయ జేఏసి నేతలపై కూడా తెలంగాణా ప్రభుత్వం నిఘా పెట్టిందని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిన్న ఆరోపించారు.
“ప్రభుత్వం మాపై నిఘా పెట్టవలసిన అవసరం ఏమిటో మాకు అర్ధం కాలేదు. మేమేమి చట్ట విరుద్దమైన పనులు చేయడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నాము. మా కార్యక్రమాలన్నీ చాలా పారదర్శకంగా మీడియా సమక్షంలోనే జరుగుతుంటాయి. మరి అటువంటప్పుడు మాపై నిఘా పెట్టవలసిన అవసరం ఏమిటి? మా కార్యక్రమాల గురించి ఏదైనా సమాచారం కావాలనుకొంటే నేరుగా మమ్మల్నే అడిగితే ఇస్తాము కదా? నేర రాజకీయాలు చేసేవారిపై నిఘా పెట్టవలసిన ప్రభుత్వం మాపై నిఘా పెట్టడం చాలా దురదృష్టకరం. ఇది చాలా హేయమైన పని. ఇటువంటి పనులు ప్రజాస్వామ్యానికి చాలా హాని చేస్తాయి. ఏ ప్రభుత్వమైన ప్రజాస్వామ్య పరిధిలో పనిచేసినంత కాలమే దానికి ప్రజాధారణ ఉంటుంది. కనుక ఇకనైనా తెలంగాణా ప్రభుత్వం తక్షణం ఇటువంటి పనులు మానుకోవాలి,” అని ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టీ-రాజకీయ జేఏసి కార్యక్రమాలన్నీ మీడియా సమక్షంలోనే నిర్వహిస్తున్న మాట వాస్తవం. ఆ సంస్థ నేతలు ఎప్పటికప్పుడు తమ కార్యాచరణని ప్రకటిస్తూనే ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులని లేదా పొరపాట్లని దాని దృష్టికి తీసుకువచ్చి వాటిని సవరించుకోమని బహిరంగంగానే చెపుతుంటారు. తెలంగాణా రాజకీయ జేఏసిని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే డిమాండ్ గురించి దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా బహిర్గతం చేసి, తమకి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు కూడా. కనుక దానిని చూసి తెరాస ప్రభుత్వం భయపడనవసరం లేదు. రాజకీయాలకి అతీతంగా వ్యవహరిస్తున్న దానిని తమ శత్రువుగా కాకుండా శ్రేయోభిలాషిగా భావించి, ప్రజాభిప్రాయాలకి అద్దం పడుతూ అది చేస్తున్న సూచనలని, ఇస్తున్న సలహాలని స్వీకరిస్తే ప్రభుత్వానికే మంచిది. కాదని దానితో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే, ఏదో ఒకరోజు అదికూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే అప్పుడు తెరాస ప్రభుత్వమే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. ఎన్నికలలో దానినీ ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.