కృష్ణవేణికి పుష్కర శోభ. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. యాత్రికులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాలు భారీగానే ఏర్పాట్లు చేశాయి. గోదావరి పుష్కర సమయంలో జరిగిన తొక్కిసలాట ఓ గుణపాఠమైంది. అందుకే భక్తుల భద్రత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లా గొందిమళ్లలో సతీ సమేతంగా పుష్కర స్నానం చేశారు. రాష్ట్రంలోని 85 ఘాట్ల వద్ద పక్కా ఏర్పాట్లు చేశారు. భక్తులకు సదుపాయాలు, భద్రత, ఇతర పనుల కోసం ప్రభుత్వం 825 కోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన కృష్నా పుష్కరాలను ఓ వేడుకలా జరపాలనేది ప్రభుత్వ సంకల్పం.
ఆర్టీసీ ఈసారి పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మొత్తం 12 రోజుల్లో 3 కోట్ల 34 లక్షల మంది పుష్కరాలకు వస్తారనేది తెలంగాణ ప్రభుత్వ అంచనా. అయితే, రెండో శనివారం, ఆదివారం, సోమవారం పంద్రాగస్టు సందర్భంగా యాత్రికులు పెద్ద సంఖ్యలో పుష్కరాలకు తరలివెళ్లే అవకాశం ఉంది. వరస సెలవుల కారణంగా పుష్కర యాత్రతో పాటు సెలవుల్లో ఉల్లాసంగా గడపడానికి విహారయాత్రను కూడా ప్లాన్ చేసుకుని వెళ్లే వారూఉన్నారు. నాగార్జున సాగర్ వంటి ప్రదేశాలకు వెళ్లిన వారు అదే రోజు తిరిగిరావడం కాకుండా ఒకటి రెండు రోజులు విహార యాత్ర చేయడానికి ఇష్ట పడతారు. కాబట్టి యాత్రికుల రద్దీని నియంత్రించడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాలు.
కొద్ది మంది యాత్రికులను కంట్రోల్ చేయడం, జరగరానికి జరిగితే గజ ఈతగాళ్లు రంగంలోకి దిగడం సులభం. కానీ ఒక్కో ఘాట్ లో ఒకేసారి వేల మంది భక్తులు చేరితే నియంత్రణ కష్టమవుతుంది. అందుకే, ఒకేసారి యాత్రికులు తండోపతండాలుగా రాకుండా కొంత నియంత్రణ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే ఘాట్ పై ఒత్తిడి తగ్గించడానికి యాత్రికులను కొద్దిసేపు ఆపే ప్రయత్నం కూడా చేయవచ్చు. యాత్రికులు కూడా ఎప్పుడెప్పుడు పుష్కర స్నానం చేద్దామా అని తొందరపడకుండా, సిబ్బంది సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. క్రమశిక్షణగా వెళ్లి వస్తే ఎంత మంది జనం ఉన్నా ఏ ఇబ్బందీ ఉండదు. అయినా ఈ మూడు రోజులూ అధికార యంత్రాంగానికి పెద్ద సవాలే. ఇలాంటి సమయంలోనే తొక్కిసలాట జరగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి.