ఏపికి ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, అధికారుల మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై కేంద్రప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయబోతోంది. ఈ సంగతి తెలియగానే రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రత్యేక హోదా సాధన కోసమే ప్రత్యేకంగా ఏర్పడిన కొన్ని సంఘాలు మళ్ళీ తీవ్ర స్థాయిలో ఉద్యమించడానికి సిద్దం అవుతున్నాయి.
రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో, రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండాపోతున్న ఈ క్లిష్ట సమయంలో ఆ సమస్యల పరిష్కారానికి మార్గం కనబడుతున్నప్పుడు, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాయే కావాలని మొండిగా పట్టుబడుతూ ఉద్యమించాలనుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రత్యేక రాజకీయాల వలన ఇప్పటికే రెండేళ్ళు వృధా అయిపోయాయి. మిగిలిన మూడేళ్ళు కూడా ఇలాగే రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తే చివరికి నష్టపోయేది రాష్ట్రమూ ప్రజలే తప్ప రాజకీయ పార్టీలు కాదు. రాష్ట్రానికి వస్తున్న అవకాశాన్ని రాష్ట్రంలో ప్రతిపక్షాలే అడ్డుకోవడం దురదృష్టకరమే.
ఇది సరిపోదన్నట్లుగా ఉత్తరప్రదేశ్ కి చెందిన బి.ఎస్.పి. రాజ్యసభ సభ్యులు తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభని నిన్న స్తంభింపజేశారు. వచ్చే ఏడాది ఫిభ్రవరిలోగా ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఒకవేళ బి.ఎస్.పి. డిమాండ్ ఊపందుకొంటే, అప్పుడు కేంద్రప్రభుత్వం యూపి ఎన్నికలు పూర్తయ్యేవరకు ఏపికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజిపై నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు. అదే జరిగితే ఏపికి కనబడుతున్న ఈ ఆఖరి అవకాశం కూడా కోల్పోతుంది. కనుక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుగా ఆ ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి చేజారిపోకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచడం చాలా అవసరం.