త్వరలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మిజోరాం, తమిళనాడు రాష్ట్రాలకి కొత్త గవర్నర్లని నియమిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడుకి గవర్నర్ గా ఉన్న కె.రోశయ్యని తప్పించి ఆయన స్థానంలో కర్నాటకలో శాసనమండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ భాజపా నేత శంకర మూర్తిని నియమించబోతున్నట్లు సమాచారం. కానీ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలపై చాల వివాదాలు ఉన్నందున, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అందుకు అంగీకరించకపోతే, శంకర మూర్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎలాగూ వేర్వేరు ప్రాంతాల నుంచి పరిపాలన కొనసాగిస్తున్నాయి కనుక తెలంగాణాకి నరసింహన్ని గవర్నర్ గా కొనసాగిస్తూ, ఏపికి శంకరమూర్తిని గవర్నర్ గా నియమించినా ఎటువంటి ఇబ్బందీ ఉండదని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ చేత కుంటి సాకుతో రాజీనామా చేయించినందున, ఆమెని పంజాబ్ గవర్నర్ గా నియమించి ఆమెకి ఊరట కల్పించాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మాజీ కేంద్రమంత్రి నజ్మా హెఫ్తుల్లాని మిజోరం గవర్నర్ గా నియమించాలనుకొంటున్నట్లు సమాచారం.
విశేషమేమిటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే గవర్నర్లుగా చేస్తున్న కాంగ్రెసేతర వ్యక్తులని అందరినీ మెల్లగా తప్పించి వారిస్థానంలో కాంగ్రెస్ నేతలని నియమించేంది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రయత్నాలు చేయలేదు. యూపియే ప్రభుత్వం నియమించిన నరసింహన్, పక్కా కాంగ్రెస్ వాది రోశయ్యని గవర్నర్లుగా కొనసాగించడమే కాకుండా ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నేత నజ్మా హెఫ్తుల్లాకి గవర్నర్ పదవి కట్టబెట్టాలనుకోవడం విశేషమే.
ఏపికి వేరేగా గవర్నర్ నియమించాలనే ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నపటికీ దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య తలెత్తుతున్న సమస్యలు, వాటి కారణాల గురించి పూర్తి అవగాహన కలిగిన నరసింహన్ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి గవర్నర్ గా కొనసాగుతున్నందునే, ఏదైనా సమస్య తలెత్తితే ఇద్దరు ముఖ్యమంత్రులతో నేరుగా మాట్లాడి దానిని పరిష్కరించే ప్రయత్నం చేయగలుగుతున్నారు. అదే రెండు రాష్ట్రాలకి వేర్వేరుగా గవర్నర్లని నియమించినట్లయితే అప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడలేరు. దాని వలన చిన్న చిన్న సమస్యలకి కూడా అందరూ డిల్లీకి పరుగెత్తవలసి ఉంటుంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ నరసింహన్నే కొనసాగించడం మంచిది. ఈ వార్తలని కేంద్రప్రభుత్వం ఇంకా దృవీకరించవలసి ఉంది కానీ నిప్పు లేనిదే పొగ రాదు కనుక ఈ వార్తలు నిజమేనని భావించవచ్చు.