నూటా ఇరవై కోట్ల జనాభా ఉన్న భారత దేశం 118 మంది క్రీడాకారులను రియో ఒలింపిక్స్ కు పంపింది. పతకాల వేటలో ఆరు రోజులు గడిచిపోయినా ఇంత వరకూ ఒక్కటైనా దక్కలేదు. మరోవైపు, చిన్న దేశాలు పెద్ద విజయాలు సాధించాయి. మన దేశంలో ఒక అసెంబ్లీ నియోజక వర్గమంత జనాభా ఉన్న దేశాలు కూడా పతకాలను సాధించాయి. మనం మాత్రం ఇంకా పతకం కోసం నిరీక్షిస్తూనే ఉన్నాం.
ఫిజీ. ఓ బుల్లి దేశం. దాని జనాభా సుమారు 9 లక్షలు. అంటే ఇంచుమించు మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని జనాభాతో సమానం. అలాంటి దేశం అప్పుడే ఓ స్వర్ణ పతకాన్ని సాధించింది.
ఉత్తర కొరియా, కమ్యూనిజం పేరుతో నిరంకుశ పాలన నడిచే దేశం. ప్రపంచంలోని ఏ దేశంతోనూ దానికి స్నేహ బంధం లేదు. అణు పరీక్షలు, అనుమతిలేని ఆయుధ ప్రయోగాలతో అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశం. దాని జనాభా 25 లక్షలు. అంటే గ్రేటర్ హైదరాబాద్ లో నాలుగో వంతు. అలాంటి దేశానికి చెందిన క్రీడాకారులు అప్పుడే 2 రజత, 2 కాంస్య పతకాలను సాధించారు.
మంగోలియా. చైనాకు ఉత్తరాన ఉన్న ఓ చిన్న దేశం. జనాభా 30 లక్షలు. అప్పుడే ఆ దేశం ఒక రజత పతకం గెల్చుకుంది. లిథువేనియా జనాభా కూడా 30 లక్షలే. అది కూడా ఒక రజత, ఒక కాంస్య పతకం సాధించింది. కజక్ స్తాన్ జనాభా కోటీ 80 లక్షలు. అది ఇప్పటికే 2 స్వర్ణ, 2 రజత, 3 కాంస్య పతకాలతో పెద్ద దేశాల సరసన చేరింది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కంటే చిన్నదైన దక్షిణ కొరియా 5 స్వర్ణ, 2 రజత, 2 కాంస్య పతకాలను గెల్చుకుంది. మరికొన్ని పతకాలను గెల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో ఓ నగర జనాభా అంత జనం సఖ్య ఉన్న అనేక దేశాలు పతకాల వేటలో పోటీ పడుతున్నాయి. మనోళ్లు మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు. క్రితం సారి భారత్ కు ఆరు పతకాలు దక్కాయి. కొంపదీసి ఈసారి శూన్యమేనా? అలా జరగకూడదని కోరుకుందాం.