గత నెలరోజులుగా కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్లకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం డిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఆ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీతో సహా దేశంలోని ప్రధాన ప్రతిపక్షపార్టీల ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. ఆ చర్చలో కాశ్మీర్ పరిస్థితిపై చాలా లోతుగా చర్చించారు. కాశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తగ్గించేందుకు రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.
ఆందోళనకారులని నియంత్రించేందుకు భద్రతాదళాలు వాడుతున్న పెల్లెట్ తుపాకుల వాడకాన్ని నిలిపివేయాలన్న ప్రతిపక్షాలు సూచనని మోడీ అంగీకరించారు. అలాగే కొన్ని ప్రాంతాలలో భద్రతాదళాలని తగ్గించేందుకు అంగీకరించారు. కాశ్మీర్ పరిస్థితి స్వయంగా అంచనావేసేందుకు అఖిలపక్షాన్ని కాశ్మీర్ తీసుకువెళ్లాలని ప్రతిపాదనకి మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఆలోచించుకొని చెపుతామని అన్నారు. కాశ్మీర్ లో శాశ్వితంగా శాంతి నెలకొల్పేందుకు ప్రతిపక్షాలు తగిన సూచనలు ఇస్తే తప్పకుండా పరిశీలిస్తామని తెలిపారు. కాశ్మీర్ లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లు పాక్ ప్రేరితమైనవేనని సమావేశంలో పాల్గొన్నవారందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉద్దేశ్యించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వాదిస్తున్న పాకిస్తాన్, ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో, బలోచిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి సమాధానం చెప్పాలి,” అని అన్నారు.
మీడియాకి తెలియజేసిన ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కోరుకొన్నట్లుగానే కాశ్మీర్ లో భద్రతాదళాల ఉపసంహరింపు జరుగుతోందని స్పష్టం అయ్యింది. అదనంగా పెల్లెట్ తుపాకుల వాడకంపై ఆంక్షలు విధించబోతున్నారు. కాశ్మీర్ లో మితవాద వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరుపబోతోంది. ఆ చర్చలు సానుకూల ఫలితం ఇస్తే మంచిదే. కానీ పాక్ ప్రభావంలో ఉన్న వేర్పాటువాదులు, వారి ప్రభావంలో ఉన్న కాశ్మీర్ యువత చేత ఆందోళన విరమింపజేయడం చాలా కష్టమైన పనే. ఈ సమస్యకి మూల కారణం పాక్ నుంచి వేర్పాటువాదులకి సహాయ సహకారాలు, ప్రోత్సాహం అందుతుండటమే. కనుక ముందుగా వారి సంబంధాలని పూర్తిగా కట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా తమలో కరడుగట్టిన వేర్పాటువాదాన్ని విడిచిపెట్టడం కూడా చాలా అవసరమే. అప్పుడే ఏమైనా సత్ఫలితాలు ఆశించవచ్చు. ఏమైనప్పటికీ, దేశంలో అన్ని పార్టీలు కాశ్మీర్ సమస్యపై రాజకీయాలు చేయకుండా ఒకే స్వరంతో మాట్లాడటం హర్షణీయం.