ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఇందులో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. ఈ మలయాళ నటుడికి అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ.. ఈ సినిమాలోకి తీసుకొచ్చారు. అయితే ఈరోజు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతున్న ఆడియో ఫంక్షన్‌కి మాత్రం మోహన్ లాల్ డుమ్మా కొట్టాడు. ఈ కార్యక్రమానికి మోహన్ లాల్ రాడంటూ ముందు నుంచీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కొరటాల శివ – మోహన్ లాల్‌కు మధ్య క్లాష్ రావడమే అని తెలుస్తోంది. ఈ సినిమాలోని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంటానని మోహన్‌లాల్ పట్టుపట్టడం, అయితే మోహన్ లాల్‌కు మరొకరి చేత డబ్బింగ్ చెప్పించాలని కొరటాల ప్రయత్నించడంతో మోహన్ లాల్ అలిగారట. ”ఇలాగైతే నేను ప్రమోషన్లకు రాను” అని ఖరాఖండీగా చెప్పేశాడట. అందుకే ఇప్పుడు జనతా గ్యారేజ్ ఆడియోకి ఆయన డుమ్మా కొట్టేసినట్టు టాక్. ‘మలయాళంలో షూటింగ్‌లు ఉన్నాయి. అందుకే రావడం లేదు’ అంటూ ఆయనో వీడియో మెసేజ్ కూడా పంపాడు. అయితే అసలు కారణం ఇదన్నమాట.