కొరటాల శివ…రైటర్‌గా గొప్ప పేరు తెచ్చుకుంది ఏమీ లేదు. రచయితగా పనిచేసిన సినిమాలన్నీ రెగ్యులర్, రొటీన్ కమర్షియల్ మసాలాలే. డైరెక్టర్‌గా మొదటి సినిమా మిర్చిలో కూడా తన మార్క్ అంటూ ఏమీ లేదు. మామూలు కమర్షియల్ సినిమానే కొంచెం స్టైలిష్‌గా తీశాడు. మనుషులకు మనుషులుగా ఉండమని చెప్పే కొన్ని డైలాగులు మాత్రం ఉన్నాయి.
తన మార్క్ ఎలా ఉంటుందో మాత్రం శ్రీమంతుడు సినిమాతో చూపించాడు కొరటాల. చాలా మందిలాగా మేధావిలా కనిపించడానికి ట్రై చేయడు. నేను మేధావిని అని పదిమందీ అనుకోవాలని మాట్లాడడు. కానీ తెలుగు కమర్షియల్ సినిమాకు కొంచెం విలువ కలిపించడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సినిమాలను ప్యారలల్, కమర్షియల్ అని రెండు కేటగిరీలుగా విభజిస్తూ ఉంటారు. ప్యారలల్ సినిమాలలో చాలా మంచి విషయం ఉంటుంది. సందేశాలు ఉంటాయి. కానీ నూటికి కోటికి ఒక్క సినిమా తప్ప ఏవీ జనాదరణ పొందవు. కమర్షియల్ సినిమాలను జనాలు ఎగబడి మరీ చూస్తారు. కానీ ఈ కమర్షియల్ సినిమాల డైరెక్టర్స్ మెస్సేజ్ ఇవ్వడానికి భయపడతారు. మా సినిమాలో మెస్సేజ్ ఉంది అని చెప్పడానికే జంకుతారు.
తమిళ్లో శంకర్ లాంటి డైరెక్టర్స్ ఉన్నారు కానీ తెలుగులో మాత్రం రెగ్యులర్‌గా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఏ డైరెక్టర్ కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ తరం డైరెక్టర్స్‌లో అయితే చెప్పుకోదగ్గవారు ఎవరూ లేరు ఒక్క కొరటాల తప్ప. శ్రీమంతుడు సినిమాలో గ్రామాల దుస్థితిని కళ్ళకు కట్టిన కొరటాల…గ్రామాల దత్తత అన్న ఒక మెస్సేజ్ చుట్టూ మంచి కమర్షియల్ కథను అల్లుకున్నాడు. ఒక కమర్షియల్ సినిమాగా చూస్తే శ్రీమంతుడులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కానీ నిజాయితీగా కొరటాల శివ చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. బాహుబలి తర్వాత రెండో స్థానంలో శ్రీమంతుడిని నిలబెట్టారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలో కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి చర్చించడం చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ లాంటి మాస్ స్టార్ సినిమాలో ఇలాంటి విషయాల గురించే చర్చించే ప్రయత్నం చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అంతకుమించిన నిజాయితీ ఉండాలి. కొరటాల శివ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో సక్సెస్‌ను కంటిన్యూ చేయగలిగాడంటే మాత్రం చాలా మంది కొత్త తరం కమర్షియల్ డైరెక్టర్స్‌కి ఇన్స్పిరేషన్ అవుతాడు. స్టార్ ఇమేజ్ ఉన్న నటులతో కమర్షియల్ సినిమాలు తీస్తూ మెస్సేజ్ ఇవ్వడానికి ధైర్యంగా ప్రయత్నం చేస్తున్న కొరటాల శివకు హ్యాట్సాఫ్.