వచ్చే ఏడాది జరుగనున్న యూపి అసెంబ్లీ ఎన్నికలలో ప్రియాంకా వాద్రాకి ప్రచార బాధ్యతలు అప్పగించాలని, ఆ పార్టీకి సేవలందిస్తున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ సూచించిన్నట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెకే ప్రధాన బాధ్యతలు అప్పగిస్తే రాహుల్ గాంధీకి ప్రాధాన్యం తగ్గించినట్లవుతుంది లేదా రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని స్వయంగా దృవీకరించినట్లు అవుతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈవిషయంపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
పది రోజుల క్రితం, సోనియా గాంధీ యూపిలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరారు కానీ వారణాసిలో ప్రచారం మొదలుపెట్టినరోజునే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. త్వరలో ఆమె కోలుకొని మళ్ళీ పార్టీ కార్యక్రమాలు చేపట్టవచ్చు కానీ ఈలోగా ఆమె కుమార్తె ప్రియాంకా వాద్రా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టడమే కాకుండా మొదటి విడతలో సుమారు 80 మంది అభ్యర్ధుల పేర్లని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటువంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం గమనిస్తే తల్లి స్థానంలో ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించినట్లేననే అభిప్రాయం కలుగుతోంది.
ఈ ఎన్నికలు అన్ని పార్టీలకి చాలా కీలమైనవే కనుక అన్నిపార్టీలు ఏదోవిధంగా గెలిచితీరాలని చాలా పట్టుదలగా ఉన్నాయి. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. కనుక ఈ ఎన్నికలలో బహుముఖ పోటీ, కాంగ్రెస్ పార్టీకి ఒంటరిపోరాటం తప్పదు. కనుక దాని విజయావకాశాలు కూడా తక్కేవేనని చెప్పవచ్చు. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ అప్రదిష్ట రాహుల్ గాంధీకి అంటకూడదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆయనని దూరంగా ఉంచి ప్రియాంకా వాద్రాని ముందుకు తెస్తోందా?ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా? అప్పుడు రాహుల్ గాంధీ ఏమి చేస్తారు? పార్టీలో, ఎన్నికల ప్రచారంలో ఆయన పాత్ర ఏమిటి?అని అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి సమాధానాలు మరికొన్ని రోజులలో కాంగ్రెస్ పార్టీయే చెప్పవచ్చు.