తూర్పు గోదావరి జిల్లాలో సుదాపాలెం గ్రామంలో ఇటీవల ఇద్దరు దళితులపై జరిగిన దాడి గురించి జాతీయ మీడియాలో కూడా వార్తలు రావడంతో ఆ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అది అపోహ కారణంగానే జరిగిన దాడి అని స్పష్టం అవడం, నిందితులందరినీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడంతో సద్దుమణిగింది.
అమలాపురం ఆసుపత్రిలో వైద్యచికిత్స పొందుతున్న ఇద్దరు దళిత బాధితుల్ని పరామర్శించేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరడంతో ఈ సంఘటనపై ఆయన ఏమైనా రాజకీయాలు చేస్తారేమోనని తెదేపానేతలు కూడా భయపడ్డారు. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు.కానీ నిన్న బాధితులని పరామర్శించినప్పుడు పెద్దగా విమర్శలు చేయలేదు. బాధితులని ముఖ్యమంత్రి స్వయంగా పరామర్శించనందుకు, బాధితులకి కేవలం రూ.లక్ష రూపాయలే పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినందుకు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు అంతే. ఇది కేవలం అపోహ కారణంగానే జరిగిన దాడి అని జగన్ తేల్చి చెప్పడంతో అందరూ తేలికగా ఊపిరి పీల్చుకొన్నారు. సాక్షి మీడియాలో కూడా ‘గోవధ అపోహ భాదితులను జగన్ పరామర్శించారు,’ అని చిన్న వార్త ప్రచురించింది. దానిలో కూడా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయలేదు. దళితులపై జరిగిన దాడి జరుగడం చాలా బాధాకరమే కానీ దీనిపై ఎవరూ ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఇంతటితో వదిలిపెట్టడం మెచ్చుకోవలసిన విషయమే.