తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులకి 12 శాతం, ముస్లింలకి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీ ఇచ్చింది. తెలంగాణా జనాభా మొత్తం 3.52 కోట్లు. దానిలో ముస్లింల జనాభా 12.68శాతం, దళితులు 9.34 శాతం ఉన్నారు. వారిలో దళితులు ఇప్పటికే 6 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది కనుక వారికి అదనంగా మరో 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస హామీ ఇచ్చింది. తెలంగాణా ప్రభుత్వం దానికోసం రెండు వేర్వేరు కమీషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఆ రెండు అధ్యయనం పూర్తి చేసి ఇటీవలే తమ నివేదికలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి అందజేశాయి.
అయితే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50 శాతంగా ఉంది. అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి వీలులేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం ముస్లింలకి రిజర్వేషన్లు కల్పించడానికి ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. దానికి కేంద్రం కూడా అనుమతించడంతో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వేషన్లు 69శాతానికి చేరుకొన్నాయి. తెలంగాణాలో కూడా అదేవిధమైన ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ముస్లింలకి 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చెపుతున్నారు. అదేవిధంగా దళితులకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది కనుక దాని ప్రకారం వారికీ రిజర్వేషన్ల శాతం పెంచుతామని ముఖ్యమంత్రి చెపుతున్నారు. వాటికోసం ఏర్పాటు చేసిన రెండు కమీషన్ల నివేదికలు చేతికి అందాయి కనుక వచ్చే అసెంబ్లీ సమావేశాలలో వాటికోసం తీర్మానాలు ఆమోదించి కేంద్రప్రభుత్వం పంపే అవకాశం ఉంది. దానిని కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్రంలో ముస్లింలకి, దళితులకి రిజర్వేషన్లు లభిస్తాయి.
ఒకవేళ సాంకేతిక, న్యాయపరమైన అవరోధాలు ఉన్నట్లయితే వెనక్కి త్రిప్పి పంపవచ్చు లేదా కాదనకుండా పరిశీలిస్తున్నామని సాకుతో ఆ ఫైల్ ని కేంద్రప్రభుత్వం పక్కనబెట్టవచ్చు. కానీ బంతి కేంద్రప్రభుత్వం కోర్టులోనే ఉంటుంది కనుక ఇక కెసిఆర్ ని, తెలంగాణా ప్రభుత్వాన్ని ఎవరూ నిందించలేరు. ఆంధ్రాలో కాపులకి రిజర్వేషన్లు అంశం కూడా ఇదేవిధంగా సాగబోతోంది. కనుక ఒకవేళ రిజర్వేషన్లు సాధిస్తే వచ్చే ఎన్నికలలో అది ఓట్ల రూపంలో ప్రతిఫలంగ దక్కవచ్చు. ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకపోయినా బంతి కేంద్రప్రభుత్వం కోర్టులో ఉంది కనుక తమ ప్రయత్నం తాము చేశామని ఇక కేంద్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని ప్రజలకి నచ్చజెప్పుకొనే సౌలభ్యం ఉంటుంది. కనుక రిజర్వేషన్లు సాధించినా సాధించలేకపోయినా ఇద్దరు ముఖ్యమంత్రులు సేఫ్ జోన్ లో ఉన్నట్లే భావించవచ్చు.