తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మందమర్రిలో సింగరేణీ కాంట్రాక్టు కార్మికుల సభలో మాట్లాడుతూ, “ఆనాడు సరళీకృత విధానాలు ప్రవేశపెట్టి ప్రభుత్వరంగ సంస్థలలో ఉపాధి అవకాశాలని చంద్రబాబు నాయుడు ద్వంసం చేశారు. తెలంగాణా వస్తే సింగరేణిని, ఉద్యోగాలని కాపాడుకోవచ్చని కెసిఆర్ పదేపదే చెప్పేవారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వారందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేరు. కానీ కెసిఆర్ కూడా ఇప్పుడు పూర్తిగా బాబు పద్ధతులనే అనుకరిస్తున్నారు. తన హామీనిలని నిలబెట్టుకోలేదు. ఆ కారణంగా నేటికీ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు కట్టు బానిసలులాగే పనిచేస్తున్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి కెసిఆర్ కి తెలిసి ఉన్నప్పటికీ అసలు పట్టించుకోవడమే లేదు. కొత్తగా కొమరం భీమ్ జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏముందని ఏర్పాటు చేస్తున్నారు? బొందల గడ్డలు తప్ప మరేమీ ఉండవక్కడ. ఇప్పటికైనా కెసిఆర్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..వారికిచ్చిన హామీలని నెరవేర్చాలి,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు రెండేళ్ళ వరకు ప్రొఫెసర్ కోదండరాం తెరాస ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేసేవారు కాదు కానీ అప్పుడప్పుడు అసంతృప్తి, అసహనం ఆయన మాటలలో బయటపడుతుండేది. కానీ గత రెండు మూడు నెలలుగా ఆయన స్వరంలో తెరాస ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా కనబడుతున్నాయి. నేరుగా కెసిఆర్ పేరు ప్రస్తావించి విమర్శలు చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంతవరకు గట్టిగా స్పందించలేదు. ప్రొఫెసర్ కోదండరాంలో తెరాస ప్రభుత్వం పట్ల ఈ అసంతృప్తి, ఆగ్రహం ఇలాగే పెరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు ఆయన రాజకీయ పార్టీతో స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో తెరాసకి దాని నుంచి చాలా గట్టి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.