మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భాజపాకి, దాని ద్వారా పొందిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడే ఆయన ఆమాద్మీ పార్టీలో చేరబోతున్నారని, వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నదని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ అప్పుడు సిద్దూ తన స్వంత రాష్ట్రమైన పంజాబ్ కి దూరంగా ఉండమని భాజపా కోరినందునే పార్టీని, పదవిని వీడి బయటకి వచ్చేశానని చెప్పుకొన్నారు. తనకి పార్టీలు, పదవులు కంటే తన పంజాబ్ రాష్ట్రం, ప్రజలే చాలా ముఖ్యమని అందుకే అన్నీ తృణప్రాయంగా భావించి త్యాగం చేసేసానని జనాలకి కాకమ్మ కధలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ జనాలు నమ్మలేదు మీడియా అసలే నమ్మలేదు. అతను ఆమాద్మీ పార్టీలో చేరేందుకే రాజీనామా చేశాడని ఘంటాపధంగా చెప్పింది. చివరికి మీడియా చెప్పిందే నిజమయింది. ఆయన ఇవ్వాళ్ళ ఆమాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో డిల్లీలో సమావేశమయ్యారు. కనుక నేడో రేపో సిద్ధూ చీపురు (ఆమాద్మీ పార్టీ చిహ్నం) పట్టుకోవడం ఖాయమని భావించవచ్చు. ఇదివరకు కమలం పట్టుకొనున్నప్పుడు సిద్దూ అరవింద్ కేజ్రీవాల్ ని విమర్శించేవాడు. ఇప్పుడు చీపురు పట్టుకొన్నాక కమలాన్ని ఊడ్చి పడేస్తాడేమో? ఒకవేళ ఆమాద్మీ పార్టీ అతనినే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే, అప్పుడు పదవులు, త్యాగాల కధలని కూడా అదే చీపురుతో ఊడ్చి చెత్తబుట్టలో పదేస్తాడేమో?