గోపీచంద్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దాని పేరు ఆక్సిజన్. రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు ఈమధ్య గుప్పుమన్నాయి. సినిమా సరిగా రాలేదని, రషెష్ చూసుకొన్న గోపీచంద్ పూర్తి అసంతృప్తితో ఉన్నాడని, అందుకే ఈ సినిమాని పక్కన పెట్టేశారని చెప్పుకొన్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని, త్వరలోనే షూటింగ్ కంప్లీట్ అవుతుందని నిర్మాత చెబుతున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చిందని, అంతే తప్ప ఆగిపోతలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఐశ్వర్య నిర్మాత. ఇప్పటి వరకూ దాదాపు రూ.22 కోట్ల బడ్జెట్ అయ్యిందట. గోపీచంద్ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది. సౌఖ్యం సినిమాతో ఫ్లాపులో ఉన్న గోపీచంద్‌కి ఈ ఆక్సిజనే ఊపిరి పోయాలి.