కెసిఆర్ ప్రభుత్వ విధానాలను విమర్శించినంత మాత్రాన తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను టిఆర్ఎస్ నేతలు రకరకాలుగా ద్రోహిగా చిత్రిస్తే తీవ్ర ప్రతికూలత ఎదురైంది. అందుకే టిఆర్ఎస్ నేతలు కొంత స్వరం మార్చి మాట్లాడారు. అయితే ఆయన ఆలోచనలేమిటి, భవిష్యత్తులో అవకాశాలేమిటనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.విభజన తర్వాత టిఆర్ఎస్ను మాత్రమే బలపర్చడానికి ఆయన నిరాకరించడం వల్లనే ప్రభుత్వానికి కోపం వచ్చిందని బలపర్చేవారు అంటుంటారు. మరోవైపున ఆయనకు రాజకీయ వ్యూహాలు, వ్యక్తిగతంగా కీలక స్థానంలో వుండాలనే ఆకాంక్ష వుందని కూడా అధికార పక్షీయులు ఆరోపిస్తుంటారు. తనకు ఎలాటి రాజకీయ ఆశలు లేవని ఆయన చెబుతుంటారు. ఏ ప్రభుత్వమైనా విమర్శలను ఆహ్వానించే పరిస్థితి దేశంలోనే లేదు. అందులోనూ కొత్త రాష్ట్రంలోనూ ఉద్యమ కాలంలోవలె స్వతంత్రంగా జెఎసిని నడిపిస్తామంటే టిఆర్ఎస్కు మింగుడుపడలేదు. ఎన్నికల్లో తమకు మాత్రమే జెఎసి మద్దతు నివ్వాలని టిఆర్ఎస్ అడిగినా తెలంగాణ కోర్కెను బలపర్చిన వారందరికీ జెఎసి మద్దతు తెల్పింది. అప్పటి నుంచే విభేదాలు పెరిగి మల్లన్నసాగర్ వంటిసమస్యలపై కోదండ జోక్యంతో పరాకాష్టకు చేరాయి. జెఎసిని కొనసాగించి ప్రజలకోసం పనిచేయాలన్న ఆలోచన హర్షనీయమే. రాష్ట్ర సాధన తర్వాత కూడా తమ పాత్ర వుండాలనుడంలోనూ పొరబాటు లేదు. అయితే ఈ క్రమంలో కోదండరాం నిరంతరం ఉద్యమ కాలంలో వలెనే తన విమర్శలను ఉమ్మడి రాష్ట్రంపైనా సమైక్య పాలకులనూ ప్రస్తావించడం ఇప్పుడు టిఆర్ఎస్ను వాటితో పోల్చడం అసందర్భం. ఒకసారి విభజన జరిగిన తర్వాత ఎవరి పాలన వారు చేసుకుంటూ సుహృద్బావం కాపాడుకోవాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. చాలా వరకూ ఆ వాతావరణం వుంది కూడా. కొంతమంది ఉద్యోగ నేతల వలె పదే పదే ఆంధ్ర తెలంగాణ వైరుధ్యాలను ముందుకు తేవడం వల్ల ప్రయోజనం లేదు. జిహెచ్ఎంసి ఎన్నికల తరుణంలో రేవంత్ రెడ్డి వంటి టిటిడిపి నేతలు ఆ తరహా వాదనలు చేయడం వల్ల టిఆర్ఎస్కు ఎంత మేలు జరిగిందో అందరూ చూశారు.నదీజలాలు సంస్థల పంపిణీ, హైకోర్టు తదితర అనేక విషయాలు ఇంకా వుండొచ్చు గాని అతి కీలకమైన విభజన పూర్తయిపోయింది.
టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను రాజకీయంగా పాలనా పరంగా విమర్శించడం అవసరమే. వాటిని ఉమ్మడి రాష్ట్ర విధానాలుగానో లేక చంద్రబాబు విధానాలుగానో మాత్రమే చూపించడం అర్థం లేనిది. ఎందుకంటే అన్ని చోట్లా పాలకవర్గాలు ఈ విధానాలనే అమలు చేస్తున్నాయి. పదేళ్లుగా పాలించిన కాంగ్రెస్ గాని, ఇప్పుడు మోడీ ప్రభుత్వం గాని అంతకన్నా భిన్నంగా చేస్తుంది లేదు.ఇప్పుడు రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలకూ ప్రజలకూ మధ్యన ప్రధాన ఘర్సణ లేదా వైరుధ్యం నడుస్తుంది తప్ప ఉభయుల మధ్య కాదు. ఆ అవసరం అవకాశం కూడా లేవు. అపరిష్రృత అస్పష్ట అంశాలుంటే వాటిని పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలి. అలాటప్పుడు వర్గ సిద్ధాంతం, పాలనా వ్యవస్థలు బాగా తెలిసిన ప్రొఫెసర్గా కోదండ గత సమస్యలన్నీ కేవలం సమైక్య రాష్ట్రం వల్లనే వచ్చాయన్నట్టు ఇంకా మాట్లాడ్డం పొసిగేది కాదు. ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్, అటు వైపు చంద్రబాబు వంటి వారే ఇరు రాష్ట్రాల ప్రజల సద్భావం గురించి మాట్లాడుతుంటే అధ్యాపక నేపథ్యం , మార్క్సిస్టు అవగాహన వున్న కోదండరాం వంటి వారు కేవలం ప్రాంతీయ కోణమే ఇంకా కొనసాగుతున్నట్టు సంకేతాలు పంపడం ఉచితం కాదు. టిఆర్ఎస్ విధానాల ప్రజా వ్యతిరేక కోణాలను నిరసించేప్పుడు ఆంధ్ర తెలంగాణను మించిన ప్రపంచీకరణ కార్పోరేట్ కోణం కూడా గుర్తించకపోతే కోదండరాం నిరుత్సాహం కలిగించిన వారవుతారు. ఉద్యమ కాలంలో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలన్న వారు ఇప్పుడు పోరాడుతున్న వామపక్షాలు ప్రజా సంఘాలతో అరమరికలు లేకుండా కలసి నడిస్తే మరింత మేలు కలుగుతుంది.అలాగాక జెఎసిని పాతరూపంలో పాత నినాదాలతోనే కొద్దిమంది బృందం పరిధిలోనే నడపాలని లేదా ప్రతిదీ సమాంతరంగా సాగించాలని భావిస్తే అదంత ఆచరణ సాధ్యం కాకపోగా ప్రభుత్వానికే ఉపయోగకారి కావచ్చు. రాజనీతి లేదా రాజకీయ వ్యూహం సమయోచితంగా మారుతుంటుందని అచార్యులు గ్రహిస్తారని ఆశించాలి. ఒక వేళ ఉద్యమ కాలంలో వున్న ప్రాధాన్యతను ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి అదొక్కటే మార్గమని ఆయన భావిస్తే అది అవాస్తవికతే అవుతుంది.