తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం వందల సంఖ్యలోనే కొత్త డైరెక్టర్స్ పరిచయమవుతున్నారు. కానీ కొత్త కథలు మాత్రం పదుల సంఖ్యలో కూడా రావడం లేదు. పాత కథలను తీసుకుని కథనంలో మాయ చేయాలనే ప్రయత్నమే అందరిదీనూ. స్టార్ హీరోలకు, స్టార్ డైరెక్టర్స్‌కి అంటే బోలెడన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోలే పాతిక కోట్ల పైన రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. ఎంత తక్కువలో తీద్దామని ప్రయత్నించినా యాభై కోట్ల లోపు సినిమా పూర్తయ్యే పరిస్థితి లేదు. బిజినెస్ కూడా డెబ్భై కోట్ల వరకూ జరుగుతున్న పరిస్థితి. అంటే అందరికీ లాభాలు రావాలంటే తెలుగు సినిమాను ఇష్టపడే ప్రేక్షకులందరూ సినిమా చూడాలన్న మాట. మళ్ళీ మళ్ళీ చూసేలా కూడా ఆ సినిమా ఉండాలి. ఆబాల గోపాలాన్ని అలరించాలన్న టార్గెట్ ఎదురుగా ఉంటే కొత్త కథలను అస్సలు ట్రై చేసే పరిస్థితి ఉండదు. ఇంటెలెక్చువల్ థ్రిల్లర్స్, సైంటిఫిక్ ఫిల్మ్స్, ఇంకా అనేక రకాల కొత్త కథలను కూడా అటెంప్ట్ చేయలేని పరిస్థితి. అలాంటి కథలు అందరికీ నచ్చేలా తీయడం చాలా కష్టం. మళ్ళీ మళ్ళీ చూసేలా చేయడం ఇంకా కష్టం. తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించేలా తీయడం చాలా కష్టం. అంత కష్టపడి సినిమా తీసే ఓపిక, అలాంటి తపన మన తెలుగు డైరెక్టర్స్‌లో చాలా తక్కువ మందికే ఉంది. ఒకవేళ డైరెక్టర్స్ ఉన్న స్టార్ హీరోలు కొత్తగా ట్రై చేయడానికి రెడీగా లేరు. విక్రమ్, సూర్యల స్థాయిలో కష్టపడమంటే మన స్టార్ హీరోలు ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు.
అయితే మన దగ్గర మీడియం రేంజ్, చిన్న సినిమాల డైరెక్టర్స్‌కి మాత్రం ఎఫ్పుడూ ఆ అవకాశం ఉంటుంది. నిజానికి వీళ్ళకు కొత్త కథలతో సినిమాలు చేయడం తప్పనిసరి. స్టార్ ఇమేజ్‌తో చేసే మేజిక్కులు వీళ్ళకు వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఏం చేసినా కథలతోనే చేయాలి. అలా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయినవే ఓ ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, కార్తికేయ, గమ్యం, ఆనంద్, ఐతే, ఆ నలుగురు, కంచె సినిమాలు. కానీ ఈ కొ్త్తదనాన్ని అందరూ అందిపుచ్చుకోలేకపోతున్నారు. మన దగ్గర ఉన్న యువ హీరోలు కూడా మంచి కథలు సెలక్ట్ చేసుకుందాం. నటుడిగా పేరు తెచ్చుకుందాం అని ఆలోచించడం కంటే కూడా ఒక్క మాస్ సినిమా చేసేద్దాం…ఒక్క రోజులో స్టార్ హీరో అయిపోదాం అన్న భ్రమల్లో బ్రతికేస్తున్నారు. మంచి కథలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. అయితే కొత్తగా ట్రై చేద్దామనుకున్న డైరెక్టర్స్‌కి మాత్రం నాని, నిఖిల్ లాంటి యువహీరోలు వరుసగా ఆఫర్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కొత్త కథ కార్తికేయ లాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ చందు మొండేటి దగ్గర ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా కొత్తగా ఉంటుంది. ‘ఏలియన్ హ్యండ్ సిండ్రోమ్’ వ్యాధి బాధితుడిగా హీరో కనిపించనున్నాడు. ఈ వ్యాధి లక్షణాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వ్యాధి సోకిన పర్సన్ ఎడమ చేయి అతని అధీనంలో ఉండదు. వాళ్ళ ప్రమేయం, ఆలోచనలతో సంబంధం లేకుండానే ఆ చేయి తన ఇష్టం వచ్చినట్టుగా పని చేసుకుంటూ పోతుంది. ఆ చేతికి వాళ్ళ శరీరానికి ఎలాంటి సమన్వయం ఉండదు. ఈ ఒక్కటి చాలు ఎంత గొప్ప కథనయినా తయారు చేయవచ్చు. బోలెడంత కామెడీ పుట్టించవచ్చు. ఆ కామెడీ నుంచే అద్భుతమైన సెంటిమెంట్‌ని కూడా తీసుకురావొచ్చు. ఆ పర్సన్ తాలూకు ఎమోషన్స్, ఇతరులు ఆ పర్సన్‌ని ట్రీట్ చేసే విధానం అన్నీ కూడా ఆసక్తికరంగానే ఉండే అవకాశం ఉంది. అలాంటి పర్సన్‌కి ఓ గర్ల్ ఫ్రండ్ ఉంటే వాళ్ళిద్దరి ట్రావెలింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ విలన్, ఫైట్స్ లాంటి పైత్యాలు ఏమీ ప్రయత్నించకుండా మంచి కథను తయారు చేసుకునే అవకాశమైతే ఉంది. ఇప్పుడు అలాంటి కథే చందూ మొండేటి దగ్గర ఉందట. మెగా హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లకు ఈ కథ చెప్పాడని, వాళ్ళకు చాలా బాగా నచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఎవ్వరు యాక్ట్ చేసినా ఈ క్యారెక్టరైజేషన్‌కి మాస్ హీరోయిజం ఆపాదించకుండా, మంచి కథతో సినిమా తీస్తే మాత్రం అంతర్జాతీయ, జాతీయ స్థాయి అవార్డు వేడుకలలో తెలుగు సినిమా పేరు కూడా వినిపించేలా చెయ్యొచ్చు. మన దగ్గర ఆలోచనా స్థాయిలో చాలా అద్భుతాలు ఉంటాయి. కానీ సినిమా పూర్తయ్యేసరికి వ్యవహారం పరమ రొటీన్‌గా ఉంటుంది. చూద్దాం…ఈ క్యారెక్టరైజేషన్, కథ ఏ రూపంలో మన ముందుకు వస్తాయో?