మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకొన్న ప్రస్థానం వెంకటేష్‌ది. ముఫ్ఫై ఏళ్లుగా ఆయన ప్రయాణం అలానే సాగుతోంది. అయితే ఈమధ్య విడుదలైన ‘బాబు బంగారం’ సినిమా ఆయనకీ షాక్ ఇచ్చింది. సినిమాపై తొలి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. రెండు మూడు కామెడీ బిట్లు తప్ప ఈ సినిమాలో ఏం లేదని విమర్శకులు పెదవి విరిచేస్తున్నారు. అయితే శనివారం విడుదలైన తిక్క ఇంకా ఘోరంగా ఉండడం, వరుసగా సెలవలు కలసి రావడంతో వసూళ్ల పరంగా సంతృప్తి పరమైన ఫలితాలనే సాధిస్తోంది బాబు బంగారం. తొలి మూడు రోజులకు గానూ రూ.15 కోట్ల వరకూ వసూలు చేసిందట. ఈరోజు (సోమవారం) కూడా వసూళ్లు బాగానే ఉన్నాయని టాక్.
అయితే బయ్యర్లకు మాత్రం నష్టాలు రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు లెక్కగడుతున్నారు. ప్రతీ ఏరియా నుంచి 25 శాతం పోయే ఛాన్సులు ఉన్నాయట. ఓవర్సీస్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా శాటిలైట్‌కి మంచి రేటు రావడం, మారుతికున్న క్రేజ్ వల్ల ఈ సినిమాని అమ్ముకోవడంతో టేబుల్ ఫ్రాపిట్తోనే గట్టెక్కింది. అయితే కొన్నవాళ్లు మాత్రం నష్టపోయే అవకాశాలున్నాయి. టోటల్‌గా ఈ సినిమా రూ.6 నుంచి 8 కోట్ల వరకూ నష్టపోయే అవకాశం ఉంది. బాబు బంగారం అని బయ్యర్లు ఆశపడితే… ఇంట్లో ఉన్నవాళ్లు బంగారం అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చేట్టు ఉందని టాలీవుడ్లో కౌంటర్లు వినపడుతున్నాయి.