స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట బురుజు నుంచి చేసిన ప్రసంగం కొన్ని విషయాల్లో చాలా ప్రత్యేకమైంది. అందులోపాకిస్తాన్ కోణంలో చూస్తే ఇది అనూహ్యమైన ప్రసంగం. ఎర్రకోట బురుజునుంచి బహుశా ఏ ప్రధానీ బెలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ గురించి ఇంత స్పష్టంగా ప్రస్తావించి ఉండరు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని మోడీకి తెలుసు. అందుకే, ఈ సందర్భంగా పాకిస్తాన్ కు షాకిచ్చారు. గతంలోపాక్ దురాక్రమించిన బెలూచిస్తాన్ కు స్వేచ్ఛ కావాలంటూ అక్కడి ప్రజలు పోరాడుతున్నారు. వారికి భారత్ సంఘీభావం తెలుపుతోంది. అక్కడి ప్రజలు ప్రధాని మోడీకి ఇటీవల ధన్యావాదాలు తెలిపారు. ఆయనపట్ల తమ గౌరవాన్నిచాటుకున్నారు. ఈ విషయాన్ని మోడీ ప్రస్తావించారు. బెలూచిస్తాన్ ప్రజలను అభినందించారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇటీవల అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఉధృతమైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మండిపడుతున్నారు. ముజఫరాబాద్ నుంచి గిల్గిట్ వరకూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. తమను భారత్ లో విలీనం చేయాలని అక్కడి ప్రజలుడిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ తమకు ఆశాకిరణమంటూ అక్కడి ప్రజలుప్రకటించారు. మోడీ ధైర్యసాహసాలను అభినందిస్తూ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని మోడీ ప్రస్తావించారు. అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపారు. అభినందించారు.
బెలూచిస్తాన్ అంశాన్ని భారత్ ప్రధాని ఇంత బాహాటంగా ప్రస్తావించడం పాకిస్తాన్ కు మింగుడు పడని విషయం. మరీ విశేషం ఏమిటంటే, మోడీ ప్రసంగం ముగిసిన కొద్ది సేపటికే బెలూచిస్తాన్ నేతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తామూ భారత్ తోపాటు స్వాతంత్ర్య దినోత్సవం జరపుకుంటామన్నారు. భారత్ జోక్యం చేసుకుంటే తమకు స్వేచ్ఛ లభించడం ఖాయమన్నారు. ఒక నాయకుడైతే జైహింద్ అని కూడా నినాదం చేశాడు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని మొన్న అఖిల పక్ష సమావేశంలో మోడీ చెప్పారు. చాలా కాలంగా అక్కడి ప్రజలు భారత్ లో విలీనమవుతామంటూ ఆందోళన చేస్తున్నారు. ఎర్రకోట నుంచి అక్కడిప్రజలకు సంఘీభావం తెలిపారు మోడీ. ఇకమీదట పాకిస్తాన్ కు కొత్త రకం ఆటను చూపించడానికి మోడీ నయా గేమ్ ప్లాన్ చేశారేమో… చూద్దాం.