స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ మూడోసారి గోల్కొండ ఖిల్లా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేస్తున్న పనులు, భవిష్యత్ ప్రణాళిక గురించి తన ప్రసంగంలో వివరించారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను ప్రస్తావించారు. కేంద్రంతో సఖ్యత ఉంటూ సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం ఆయన ప్రసంగంలో మిస్సయింది.
పొరుగు రాష్ట్రాలంటూ మహారాష్ట్రతో జల వివాదాలపై ఒప్పందానికి వచ్చిన విషయం తెలిపారు. చర్చలు పలించాయని, ఈనెత 23న ముంబైలో చరిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని చెప్పారు. కర్ణాటకతోనూ వివాదాలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. జూరాలకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకున్న విషయం వివరించారు. ఛత్తీస్ గఢ్ నుంచి నాలుగు నెలల్లో 1000 మెగావాట్ల విద్యుత్తు వస్తుందని చెప్పారు.
ఈ మూడు పొరుగు రాష్ట్రాల సంగతి సరే. మరి ఆంధ్ర ప్రదేశే మాటేమిటో. ఆ విషయం మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఒక్కోసారి ఈ రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కనిపిస్తుంది. మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. రాజకీయంగా, కేసుల పరంగా ఘర్షణ వైఖరి తరచూ కనిపించేది. అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లినా ఓటుకు నోటు కేసు దర్యాప్తు నడుస్తూనే ఉంది. తాజాగా నయీం కేసులో టీడీపీ మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి పేరు ప్రస్తావించకుండానే పుంఖానుకపుంఖాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ ఆమె మీడియా సమావేశంలో ఖండించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం, సఖ్యత గురించి కేసీఆర్ చెప్పలేదు. అయితే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని మాత్రం ఘంటాపథంగా చెప్పారు. మిషన్ భగీరథ ప్రారంభం, ఆ పథకాన్ని ప్రధాని మోడీ పొగడటం గురించి గొప్పగా చెప్పారు. మోడీ ప్రభుత్వం మంజూరు చేసిన 1951 కిలోమీటర్ల జాతీయ రహదారుల వల్ల తెలంగాణకు ఎంతోమేలు కలిగింద్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి
2592 నుంచి 4590 కిలోమీటర్లకు పెరిగిందని కేసీఆర్ వివరించారు.
పంద్రాగస్టు సాయంత్రం ఓ విశేషం చోటు చేసుకుంది. రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం పేరుతో ఇచ్చిన తేనీటి విందుకు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. సఖ్యత సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ మరోసారి ఒకేచోట కనిపించారు.