స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు చేసిన ప్రసంగాలలో సహజంగానే స్వోత్కర్ష, పరనింద కనబడ్డాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ప్రభుత్వాలని, పరిపాలనని, అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. అది సహజమే.
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్, తెదేపాల పాలనలో తెలంగాణా చాల నష్టపోయిందని చెప్పుకొస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పాలన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని వాపోయారు. చంద్రబాబు నాయుడు, కెసిఆర్ అధికారం చేపట్టి రెండేళ్ళపైనే అయ్యింది. కానీ నేటికీ గత ప్రభుత్వాలని నిందించడం మానుకోవడం లేదు. ఆవిధంగా చెప్పుకోవడం వలన గత ప్రభుత్వాల కంటే తామే చక్కటి పరిపాలన సాగిస్తున్నామని చెప్పుకోగలుగుతున్నప్పటికీ, వారిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయనే సంగతి ఇద్దరూ విస్మరించారు. రేపు వారి స్థానంలో మరొక పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే అప్పుడు అవి కూడా తెదేపా, తెరాస పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకోవడం తధ్యం. కనుక ప్రతిపక్షాలకి అటువంటి అవకాశం ఇవ్వకూడదనుకొంటే, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా అభివృద్ధిని గణాంకాలలో కాకుండా ప్రజల కళ్ళకి కనబడేలా చేయవలసి ఉంటుంది.
మోడీ ప్రభుత్వంపై కూడా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చాలా విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, గత యూపియే పాలనతో పోలిస్తే మోడీ పాలన చాలా చక్కగా, స్నేహపూరితంగా, పారదర్శకంగా, చురుకుగా, అవినీతి రహితంగా సాగుతోందని ప్రజలు, చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తున్నారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా మోడీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని పాలన సాగిస్తే, ప్రజలే వారి సమర్ధతని, చిత్తశుద్ధిని గుర్తించి మళ్ళీ వారికే అధికారం కట్టబెడతారు కదా?
ఇక నిత్యఅసంతృప్తివాది జగన్మోహన్ రెడ్డి, మనకి నిజంగానే స్వాతంత్ర్యం వచ్చిందా? అని అడిగిన ప్రశ్న ఆలోచించదగినదే. అందుకు కూడా ఆయన చంద్రబాబు నాయుడునే నిందించడం విశేషమే. ఆ విషయం పక్కనబెడితే, నయీం వంటి అసాంఘిక శక్తులు, హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఐసిస్ ఉగ్రవాదులు, కాల్ మనీ అరాచకాలు, రకరకాల మాఫియాలు, కాశ్మీర్ లో వేర్పాటువాదులు, చైనా, పాకిస్తాన్ దేశాలు మన స్వాతంత్ర్యానికి తరచూ సవాలు విసురుతూనే ఉన్నాయి. ఇక పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, మౌలికవసతుల లేమి వంటి అనేక సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. దేశ ప్రజలలో రాజకీయంగా చాలా చైతన్యం వచ్చినా, రాజకీయ నేతలలో ఆలోచనాదోరణిలో మార్పురావడం లేదు. నేటికీ ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే పని కానిచ్చేస్తున్నారు. ఆ కారణంగానే దేశంలో ఆశించినంతగా జరుగలేదు. కానీ వారి ప్రసంగాలలో, గణాంకాలలో మాత్రం చాలా అభివృద్ధి జరిగినట్లు కనబడుతోంది. కనుక ప్రజలలో కాదు మన రాజకీయ నాయకులలోనే మార్పు, చైతన్యం రావాలసి ఉంది. అప్పుడే ఈ సమస్యలన్నీ పరిష్కరింపబడుతాయి. దేశం కూడా బాగుపడుతుంది.