సొంతూరిని బాగుచేయాలన్న కాన్ సెప్ట్ తో తీసిన శ్రీమంతుడు చిత్రం చూడగానే మనకు బాహుబలి తప్పకుండా గుర్తుకురావాల్సిందే. బాహుబలి సినిమా విడుదలైన కొద్దిరోజులకే శ్రీమంతుడు థియేటర్లను తాకింది. `ఊరు నీకు చాలాఇచ్చింది. ఋణం ఉంచుకోకూడదు. ఇచ్చేయ్…’ అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే మహేష్ బాబు శ్రీమంతుడు. ఇంతకుముందు విడుదలైన బాహుబలి సినిమా పక్కా జానపద చిత్రం. ఇదేమో సామాజిక స్పృహతోకూడిన సాంఘిక చిత్రం. అదో చందమామ కథ, ఇదో న్యూసోషల్ ఫార్ములాతో కూడిన కథ. ఎక్కడా పోలికే ఉండదు. కానీ…
శ్రీమంతుడు సినిమా చూడగానే నాకు (ఈ రచయితకు) మాత్రం బాహుబలి సినిమా గుర్తుకువచ్చింది. సినిమాహాల్లో కూర్చుని ఈ సినిమా చూస్తుంటే ఉన్నట్టుండి ఎవరో వీపుమీద చరచినట్లనిపించింది. మహాబలుడెవరో నన్ను అమాంతం సినిమాథియేటర్ అవతలకు విసిరేసినట్టు అనిపించింది.
`ఎవరు , నన్నంత బలంగా తోసేసింది ఎవరు ?’ ఆలోచించాను. బుర్రకు పదనుపెట్టి ఆలోచించాను. అప్పుడు తట్టింది – ఆ వ్యక్తి ఎవరో కాదు. మహాబలుడు… మహా బాహుబలుడు.
ఈ బాహుబలుడు మరెవరోకాదు. ప్రిన్స్ మహేష్ బాబే. అమ్మో..! అబ్బో..!! ఏమి ఆ బలం..? ఏమి ఆ బాహువుల శక్తి ?? హర్ష పాత్రను తన భుజబలంతో ఆకాశమంతఎత్తుకు తీసుకువెళ్ళాడు. బాహుబలి సినిమాలో శివుడు (ప్రభాస్) శివలింగాన్ని పైకిలేపితే, ఈ శ్రీమంతుడేమో ఎడమచేత్తో పదిమంది మనుషులను అవలీలగా చితకొట్టేయగలడు. అంటే మనకేం అర్థమవుతోంది, ఈ సదరు శ్రీమంతులంగారు ఒట్టి బాహుబలుడు కాదు, మహాబాహుబలుడన్నమాట.
హీరో మహేష్ అన్న సంగతి కాసేపు పక్కనపెట్టి, కథలోని హర్ష అనే శ్రీమంతుడి బాహుబలశక్తిని అంచనావేసే ప్రయత్నం చేద్దాం.
మానవాతీతశక్తులు ఎలా వచ్చాయ్?
హర్ష (మహేష్) ఆగర్భశ్రీమంతుడు. సరే, మనకొచ్చే నష్టమేమీలేదు. అతి సుకుమారుడు. లేతములక్కాడలా నిగనిగలాడుతుంటాడు. అలాంటి సుకుమారుడికి ఓ అందమైన సైకిల్ ఉంటుంది. అది ఎక్కివెళుతుంటే చూసేవారికి కూడా చూడముచ్చటగానే ఉంటుంది.
అయితే, చిత్రమేమంటే ఈ లేతములక్కాడ ఒక ఊపుఊగితే, అవతల నిత్యం వ్యాయామంచేస్తూ, కండలు గట్రా పెంచేసిన విలన్ గ్రూప్ వాళ్లు దూదిపింజల్లా పైకిఎగిరిపోవడం. లేదంటే, మట్టిలో కూరుకుపోవడం. కాదంటే, ఆకాశంలోకి ఎగిరెళ్లి విలవిల్లాడుతూ క్రిందపడటం. లేతములక్కాడలాంటి చేతులు తాకగానే శత్రువు ఎముకలు విరిగిన సౌండ్. మరి, ఇంతటి బాహుబలుడు ఎక్కితే ఆ సుకుమార సైకిల్ ఉంటుందా, విరిగి ముక్కలవదా ? అన్న సందేహపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ సుకుమారుడికి తలచుకున్నప్పుడు మాత్రమే అతని బాహువులకు అంతటి శక్తి వస్తుందన్నమాట. (ఇలా అని ప్రేక్షకుడు సరిపుచ్చుకోవాలి) పోనీ ఈ సుకుమారుడు కేరళ మర్మకళలను అభ్యసించినట్టు చూపిస్తే నాలాంటి సందేహపురుగులకు పనిఉండేదికాదు. కానీ అలా చేయలేదు.
`అయినా, మీది చాదస్తం, మీకు తెలుగు సినిమాలు చూడటంరాద’ని ఎవరైనా నాపై విమర్శనాస్త్రాలు సంధించవచ్చు. కానివ్వండి. నేను వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమే. `అతడు’ సినిమాలో హీరో సింగిల్ చేత్తో ఫెన్సింగ్ కోసం నాటిన సిమెంట్ స్తంభాలను నీట్ గా అరటిఊచతెగనరికితే పడిపోయినట్టు నేలరాలిస్తే, మీరెందుకు కొశ్చిన్ చేయలేదని అడగొచ్చు. బ్రహ్మానందం తన పొట్టపై హిట్ చేయమన్నప్పుడు తెగ సిగ్గుపడిన `అతగాడు’ చివరకు హిట్ చేయగానే బ్రహ్మానందానికి కళ్లుబైర్లు కమ్మిన సీను గురించి మీరెందుకు ప్రశ్నించలేదని కూడా అడగొచ్చు. అయితే, ఆ సినిమాలో హీరో ముదురుటెంక. గన్లతో ఆడుకునే కిరాయిహంతకుడు. కనుక ఇక మనం మాట్లాడటానికేముంది.
పరకాయప్రవేశం
ఇక్కడ అట్లాకాదే, ఇతగాడికి అలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. అయినా `అతడు’లోని లక్షణాలు పుణికిపుచ్చుకుంటాడు. అంటే ప్రేక్షకులు ఏం అనుకోవాలి…? ఇకపై మహేష్ బాబు ఏ పాత్ర వేసినా అతగాడు చేయిచాపికొడితే, మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనన్న ఇండికేషన్ వచ్చేసిందన్నమాట. నందమూరి బాలకృష్ణ ఒంటిచేత్తో రైలుని ఆపడం, గురుత్వాకర్షణ శక్తిని వ్యతిరేకంగా ఎగరడాలు…ఇవన్నీ రీజన్ కు అందవు. హీరో ఇమేజ్ ని పెంచుకోవడంకోసం, మాస్ ఆడియన్స్ ని ఆకర్షించడంకోసమో ఇలాంటి మానవాతీత శక్తులను హీరోలకు కట్టబెడుతున్నారు. మాస్ ఆడియన్స్ ఇప్పటికీ చాలా అమాయకులనీ, వారు తేలిగ్గా బుట్టలో పడతారని సినీవర్గాలవారు చాలా నమ్మకంగా అనుకుంటారు. ఇదే ఫార్ములాను కొరటాల శివ గుడ్డిగా ఫాలో అవడంతో సినిమా చూస్తుంటే మనకు హర్ష పాత్రలోకి బాహుబలుడు పరకాయప్రవేశం చేసినట్టు అనిపిస్తుంది. మంచి సోషల్ కాజ్ తో తీసిన సినిమాలో హీరో ప్రవర్తన రియాల్టీకి దగ్గరగా ఉంటే ఎవరైనా ఆ మంచిని స్వీకరించి, ఆచరించాలని ప్రయత్నిస్తారు. కానీ శ్రీమంతుడు సినిమా చూసి ఊరిని బాగుచేయాలని వెళ్లాలంటే ముందుగా మీరు అతీతశక్తులను సంపాదించాల్సిందేనన్న ఇన్నర్ మెసేజ్ ని జోడించారు. అలాంటి శక్తులుమీలో లేకపోతే మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఎప్పటికీ అందుకోలేరన్నదే ఈ సినిమా మనకు తేల్చిచెప్పేసింది.
మంచి మెసేజ్ తో సినిమాతీసేటప్పుడు సహజత్వానికి దగ్గరగాఉంటే, ఆ సినిమాను స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకానీ, కేవలం మహాబాహుబలుడు లాంటివారివల్లనే సాధ్యమనుకుంటే సినిమాను కేవలం సినిమాగానే చూసి జనం మరచిపోతారు. చివరకు గుర్తుండిపోయేవి, అసాధారణమనిపించే హీరో చేష్టలు తప్ప.
– కణ్వస