ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజి వస్తుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం వివిధ పద్దుల క్రింద కేవలం రూ.1976 కోట్లు మాత్రమే విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పట్ల ఈవిధంగా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వంతో ఏవిధంగా వ్యవహరించాలి? భాజపాతో సంబంధాలు కొనసాగించడం మంచిదా కాదా? అని తెదేపా ప్రభుత్వం ఆలోచనలో పడింది.
సరిగ్గా ఈ సమయంలోనే విశాఖలో ‘ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్’ ఏర్పాటుకి శుక్రవారం శంఖుస్థాపన జరుగబోతోంది. దీని కోసం కేంద్రప్రభుత్వం రూ.175 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైద్య ఆరోగ్య సంబంధిత పరికరాలని ఉత్పత్తి చేసేందుకు విశాఖ జిల్లాలో పెదగంట్యాడ మండలంలో నడుపూరు వద్ద 275ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కారి కూడా హాజరు కాబోతున్నారు.
విభజన చట్టంలో ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తామని నిర్దిష్టంగా ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయినా దానికి కేంద్రప్రభుత్వం బారీగా నిధులు కేటాయించింది. ఈరోజు దానికే శంఖుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. కనుక రాష్ట్రం నిలద్రొక్కుకొని అభివృద్ధి చెందడానికి కేంద్రప్రభుత్వం ఏమీ సహాయం చేయడంలేదని ఆరోపించలేము. కానీ, కేంద్రప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తరచూ దానిపై ఆరోపణలు గుప్పిస్తున్న తెదేపా నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి సహాయ సహకారాల గురించి కూడా గట్టిగా చెప్పుకొని ఉంటే అప్పుడు ప్రజలే కేంద్రం అందిస్తున్న సహాయం గురించి ఒక అంచనాకి వచ్చేవారు. కానీ ఇటువంటి ప్రాజెక్టులకి కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులు, సహాయసహకారాల గురించి మాట్లాడకుండా ఎప్పుడూ సహాయం చేయలేదనే విమర్శలు గుప్పించడం రాజకీయం చేయడంగానే బావించవలసి ఉంటుంది.
రాష్ట్ర భాజపా నేతలు తెదేపా చేస్తున్న విమర్శలకి నొచ్చుకొంటూ వారికి ఏవిధంగా కౌంటర్ ఇవ్వాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు తప్ప డిల్లీ నుంచి ఇటువంటి వివరాలన్నీ తెచ్చుకొని ప్రజలలోకి వెళ్లి వాటి గురించి గట్టిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఆ కారణంగా తెదేపా చేస్తున్న విమర్శలు, ఆరోపణలనే ప్రజలు నమ్మవలసి వస్తోంది. దాని వలన కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రంలో భాజపాకి కూడా చాలా చెడ్డపేరు తీవ్ర నష్టం జరుగుతోందని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.