ఓ రావణాసురుడు, ఓ కీచకుడు, ఇంకా పేర్లు వింటేనే మనం నిద్రలో కూడా ఉలిక్కిపేడిలేచే రాక్షసజాతికి చెందిన బోలెడు మంది కంటే చాలా పెద్ద రాక్షసుడు. కొన్ని రోజుల క్రితం వరకూ మన మధ్యనే ఉన్నాడు. వాడిదో గొప్ప సామ్రాజ్యం. తెలుగు ప్రజలు ప్రభుత్వ పన్నులతో పాటు వాడికి కూడా ‘నయిూం ట్యాక్స్’ కట్టాల్సిందే. లేకపోతే ప్రాణాలు తీస్తాడు. ప్రజాప్రతినిధులను చంపాడు. అత్యున్నత స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులను చంపాడు. ఇక సామాన్య ప్రజలనైతే ఎంతమందిని చంపాడో లెక్కే లేదు. చట్ట పరిమితులతో సంబంధం లేకుండా వేల ఎకరాలు వాడి సొంతం. వేల కోట్లు సంపాదించాడు. బంగారం, వజ్రాలు లాంటివి వాడి ఖజానాలో ఎన్నో. తెరవేల్పులుగా కొలవబడే సినిమా స్టార్స్‌ని బెదిరించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు ఓ రాక్షస రాజు.
నయిూం అనే వాడు చనిపోయిన మరుక్షణం నుంచి…వాడి పైన మన మీడియా వాళ్ళు రామ్ గోపాల్ వర్మను మించిపోయి మరీ వ్రాస్తున్న క్రైమ్ రాతల తాలూకూ సారాంశం ఇదే. స్టోరీ, స్క్రీన్ ప్లేను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రోజుకొక కొత్త కథనం రాస్తున్నారు. నయిూం ఆంతరింగిక సమావేశాల గురించి కూడా వ్రాస్తున్నారు. నయిూం మాటలను పొల్లు పోకుండా రాసేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాతలు చదివేవాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విషయం ఒక్కటే. నయిూం గురించి మీడియాకు తెలియని విషయాలు ఏమీ లేవని. నయిూం రాక్షస సామ్రాజ్యానికి సంబంధించిన ఆనుపానులన్నీ మీడియాకు తెలుసని.
మరి అన్ని విషయాలూ తెలిసినవాళ్ళు నయిూం చనిపోక ముందు ఎందుకు ప్రజలకు చెప్పలేదు. చనిపోయిన తర్వాతే ఎందుకు చెప్తున్నారు? బ్రతికున్నప్పుడు కూడా మేం సంవత్సరానికి ఒకసారి నయిూం గురించి వ్రాశాం అని ఎక్కడో ఓ మూలన రాసిన వార్తను చూపించే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఇప్పుడు వ్రాస్తున్నట్టుగానే బేనర్ ఐటెమ్స్, పేజీలకు పేజీలు, పుంఖాను పుంఖాలుగా ఎందుకు ప్రచురించలేదు. నయిూంని రాజకీయ నాయకులు, పోలీసులే పెంచి పోషించారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సైలెంట్‌గా ఉన్నారనుకుందాం. మరి మీడియాకు ఏమైంది? మీడియాకు కూడా కవర్లు పంపించాడా నయిూం? పార్ట్నర్షిప్ ఇచ్చాడా? మరి ఎందుకు రాయలేదు? బ్రతికున్నప్పుడే ఈ స్థాయిలో వార్తలు రాసి ఉంటే పోలీసులు, పాలకులపైన ఒత్తిడి పెరిగి ఉండేది కదా? ఇంకా చాలా కాలం ముందుగానే నయిూం సామ్రాజ్యం అంతమయి ఉండేది కదా?
బ్రతికుండగా రాయలేదు. మరి ఇప్పుడెందుకు ఓ రక్త చరిత్ర సినిమాలాగా, క్రైమ్ నవలలాగా. సొంత కవిత్వాలన్నీ జోడించి ప్రజలకు వ్యవస్థలపైనే నమ్మకంపోయే స్థాయిలో వ్రాస్తున్నారు. పోలీసుల విచారణకు ఇబ్బందులు కలిగించే లాంటి వార్తలు కూడా ఎందుకు ప్రజెంట్ చేస్తున్నారు? మీ రాతల్లో ఎక్కడా కూడా అధికారంలో ఉన్న వాళ్ళ పేర్లు కనిపించడం లేదెందుకు? విచారణ నిస్ఫాక్షికంగా, నిజాయతీగా జరిగేలా చేయడం కోసమే రాస్తున్నారు అని అనుకుందామంటే బడాబాబులు, నయిూంతో కలిసి క్రైమ్స్ చేసిన వాళ్ళ పేర్లు రాయడం లేదు మీరు. బాధితుల గురించి వ్రాస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, మంత్రికి నయిూంతో సంబంధాలు లేవా? ఫైనల్‌గా మీ వార్తలన్నీ ఫాలో అవుతూ ఉంటే అర్థమవుతున్నది ఒక్కటే. ఫిక్షన్ రైటర్ మధుబాబు మీ రాతల్లో కనిపిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం మీ క్రియేటివిటీ మామూలుగా ఉండడంలేదు. ఒక్కసారి మీ ఆర్టికల్ చదివారంటే….సీరియల్ చూసేవాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసినట్టుగా….మరుసటి రోజు రాబోయే మీ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారు రీడర్స్. క్రైమ్ రచనలను అమ్ముకోవాలన్న మీ ప్రయత్నంలో తప్పులేదు. కానీ జర్నలిజం, ప్రజా ప్రయోజం, నిజాయతీలాంటి కబుర్లు సందర్భం వచ్చినప్పుడల్లా మీ గురించి మీరే చెప్పుకుంటూ ఉంటారు చూడండి. అదే సమస్య…..?
ఆ లక్షణాలన్నీ ఉండి ఉంటే సమస్య బ్రతికి ఉన్నప్పుడే ఇలాంటి రాతలు రాసేవాళ్ళు.