హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్. బ్మాడ్మింటన్ లో విజయాలకు కూడా హైదరాబాద్ ఫేమస్ అవుతోంది. ముత్యాల నగరం కాస్తా రత్నాల్లాంటి క్రీడాకారులకు నెలవుగా మారింది. గోపీచంద్ అకాడమీ నుంచి వచ్చిన సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. ఈసారి రియోలో సింధు రజత పతకంతో మెరిసింది. స్వర్ణ పతకం గెలిచే అవకాశం వచ్చినా, మానసిక ఒత్తిడితో పరాజయం పాలైంది.
భారత్ కు ఒలింపిక్ పతకాలు తెచ్చే వారిలో రెజ్లర్లు కీలకం. రెజ్లింగ్ అంటే హర్యానా గుర్తుకొస్తుంది. ఈసారి మహిళల విభాగంలో తొలి పతకాన్ని అందించిన సాక్షి మాలిక్ కూడా హర్యానా క్రీడాకారిణే.
బ్యాడ్మింటన్ లో క్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి పెరుగుతోంది. బ్మాడ్మింటన్ లో ఒకప్పుడు ఇండోనేసియాకు తిరుగులేదు. ఆ తర్వాత చైనా వంతు. ఎవరైనా సరే పతకం గెలవాలంటే చైనా గోడను దాటాలి అనేవారు. ఈసారి ఆశ్చర్యకరంగా సింధు చైనా వాల్ ను అలవోకగా దాటింది. ఫైనల్లో స్పెయిన్, భారత్ తలపడ్డాయి. భారత్ తరఫున ఆడి ఓడిన సింధు హైదరాబాదీ సంచలనంగా పేరు పొందింది.
శుక్రవారం హైదరాబాద్ లోనే కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆమె పేరు మార్మోగింది. ర్యాలీలు జరిగాయి. పూజలు చేశారు. హోమాలు చేశారు. ఆమె స్వర్ణ పతకం సాధించాలని యావత్ భారతం ఆకాంక్షించింది. అయితే బంగారు పతకం దక్కకపోయినా రజతం తెచ్చిన సింధూయే మా బంగారం అని హైదరాబాదీలు మురిసి పోతున్నారు. పతకాల కోసం ముఖం వాచి ఉన్న భారత్ కు, రజత పతకాన్ని అందించడమూ గొప్పే.