వంద కోట్లకు పైగా జనాభా. 118 మంది క్రీడాకారులు. పోటీలు ముగింపు దశకొచ్చాయి. ఒక్క పతకమూ దిక్కులేదు. సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించగానే యావత్ భారత దేశం పులకించి పోయింది. పీవీ సింధు రజత పతకాన్ని ఖాయం చేయగానే ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఫైనల్లో సింధు గెలవాలని పూజలు చేశారు. నోములు నోచారు. ఎందుకు ఇదంతా?
ఒక్క పతకం కోసం అంతగా వెంపర్లాడే పరిస్థితి మనకెందుకు వచ్చింది? హైదరాబాదీ అమ్మాయి రజత పతకం గెలవడం గొప్ప విషయమే. అయితే, ఇంత పెద్ద దేశం ఒకటీ రెండు పతకాలతో సరిపెట్టుకునే దురవస్థ ఇంకెంత కాలం అనేదే ప్రశ్న.
రియోలో అమెరికా పతకాల వేటలో సెంచరీ దాటింది. 100 పతకాల్లో 37 స్వర్ణాలున్నాయి. కాబట్టి ఒక్క స్వర్ణ పతకం గురించి వంద కోట్ల మంది తపన పడటం ఏమిటో అమెరికన్లకు అర్థం కాదు. వాళ్లకు ఫెల్ప్స్ ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు. చీకటి ఖండంలోని జమైకా దేశస్తులకూ మన బాధ అర్థం కాదు. ఎందుకంటే వాళ్లకు ఉసేన్ బోల్ట్ ఉన్నాడు.
చాలా దేశాల్లో క్రీడా సంస్కృతి ముఖ్యమైన విషయం. ప్రభుత్వాలకు, ప్రజలకు ఆటలు ఓ ముఖ్యమైన అంశం. కొన్ని దేశాల్లో కొందరు ఆటగాళ్లు మరీ ప్ర్తత్యేకం. రికార్డులు బద్దలు కొట్టడమే వాళ్ల పని. ఉసేన్ బోల్ట్, మైకేల్ ఫెల్ప్స్ వంటి వాళ్లు ఆ బాపతే. మన దేశంలోఈ రెండూ లేవు. క్రికెట్ పిచ్చిలో పడి కొట్టుకోవడం తప్ప, ఘనమైన క్రీడా సంస్కృతీ లేదు. వ్యక్తిగతంగా ప్రపంచాన్ని నివ్వెర పరిచే స్థాయి స్పోర్ట్స్ హీరోలూ లేరు.
అందుకే, సింధు ఫైనల్లో అడుగు పెట్టగానే మనందరం పండుగ చేసుకున్నాం. ఎలాగైనా ఫైనల్లో గెలిస్తే బాగుండు అనుకున్నాం. ఈసారి ఓ బంగారు పతకం వస్తే చూడాలని ఆశపడ్డాం. కానీ సింధు ఒత్తిడి ముందు తలవంచింది. రజతంతో సరిపెట్టింది. అయినా అదే బంగారం అనుకుందాం. సింధుకు కంగ్రాట్స్ చెప్పేద్దాం.