ఇద్దరూ భరత మాత ముద్దు బిడ్డలే. ఒలింపిక్స్ లో భారత్ పరువు నిలిపిన వాళ్లే. సాక్షిమాలిక్ భారత్ కు రియోలో తొలి పతకం అందించింది. కాకపోతే కాంస్యం. పీవీ సింధు స్వర్ణ పతకం మిస్సయింది. రజతాన్ని అందించింది. అయితే వీరిద్దరి జీవితాలూ పూర్తి వైరుధ్యమైనవి.
సాక్షి క్రీడా జీవితం ఏటికి ఎదురీత. హర్యానాలో రోహ్ తక్ జిల్లాలో ఉ్న మోఖ్రా అనే గ్రామంలో 23 ఏళ్ల క్రితం పుట్టింది సాక్షి. ఆమె తండ్రి బస్ కండక్టర్. తల్లి అంగన్ వాడీ క్లినిక్ లో సూపర్ వైజర్. సాక్షి రెజ్లింగ్ ను ఎంచుకున్న రోజు నుంచీ వ్యతిరేకతే.
కుస్తీ మగాళ్ల ఆట. అమ్మాయివి నీకెందుకు అని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయినా ఆమె వినలేదు. మొండిగా కోచింగ్ కు వెళ్లేది. అసలు నువ్వు కుస్తీ మానేసి చదువుకుంటావా లేదా అని తల్లి చాలా సార్లు గదమాయించింది. బాగా చదువుతాను, బాగా ఆడతానని చెప్పేది. చెప్పినట్టే చదువులో మంచి మార్కులు సాధించేది. ఆటలోనూ మెళకువలు నేర్చుకుంది.
అలా క్రమంగా అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం మొదలుపెట్టింది. 2013 కామన్ వెల్త్ చాంపియన్ షిప్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లింది. కాంసక్య పతకం సాధించింది. 2014, 2015లోనూ విజయాలు సాధించింది. రియోలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. “నేను చాలా తప్పు చేశాను. నా బిడ్డను ఎంతో కష్టపెట్టాను” అని ఇప్పుడు సాక్షి మాలిక తల్లి బాధపడుతోంది. అదే సమయంలో తన కూతురి విజయానికి గర్వపడుతోంది.
పీవీ సింధు క్రీడా జీవితం వడ్డించిన విస్తరి. తల్లిదండ్రులు వాలీబాల్ క్రీడాకారులు. బిలియనీర్లు కాకపోయినా ఉన్నంతలో సింధును మంచి స్కూల్ కు, కోచింగ్ కు పంప గలిగే కుటుంబం. గోపీచంద్ స్ఫూర్తిగా బ్యాడ్మింటన్ ఆడటం మొదలుపెట్టిన సింధు, చివరికి అతడి శిష్యరికంలోనే రాటుదేలింది. అంతర్జాతీయంగా అనేక విజయాలను సొంతం చేసుకుంది. రియోలో రజత పతకాన్ని సాధించింది.
సాక్షి, సింధు ఇద్దరి క్రీడాంశాలు వేరు. అయినా దూకుడునే నమ్ముకున్న క్రీడాకారిణులు. రెజ్లింగ్ కాంస్య పతకం కోసం జరిగిన చివరి పోటీలో సాక్షి దూకుడు కు అంతా ఆశ్చర్యపోయారు. చావో రేవో అనే కసితో పట్టు పట్టింది. విజయాన్ని సొంతం చేసుకుంది.
సింధు రియోలో ఆడిన చివరి మ్యాచ్ లో మాత్రం చేజేతులా ఓడిపోయింది. తొలిసెట్ ను గెలిచినప్పుడు మ్యాచ్ ను గెలవడం కష్టం కాదు. అయినా, చివరి రెండో సెట్లనూ భయంతో ఓడిపోయింది. ఆత్మ విశ్వాసం లోపిస్తే ఎంత అనర్థమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రత్యర్థి ప్రపంచ చాంపియన్ కావచ్చు, నెంబర్ వర్ ర్యాంకర్ కావచ్చు. అయినా, బాగా ఆడిన వాళ్లే గెలుస్తారనే ధీమా కొరవడింది. ఫైనల్లో ఓడినా, భారత్ కు ఒలింపిక్ రజత పతకాన్ని అందించిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది.
రియోలో ప్రస్తుతానికి వీళ్లిద్దరే భారత్ పరువు నిలిపిన క్రీడాకారిణులు.