ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్న మాట వాస్తవం. ప్రత్యేక హోదా రాదనే సంగతి ఆయనకి ముందే తెలిసి ఉన్నప్పటికీ, ఆ విషయం ప్రజలకు చెప్పే ధైర్యం లేక వారిని మెల్లిగా ఆ విషయం గ్రహించేలా చేసేందుకే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు. కానీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో వేడి పెరిగినప్పుడల్లా ఆయన కూడా ప్రజలు, ప్రతిపక్షాలతో కలిసి కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రజాగ్రహం తనపైకి మళ్ళకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంగతి ప్రజలు అర్ధం చేసుకొన్నారు. వారికి అర్ధం అయిందనే సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. అంతేకాదు ఈవిధంగా మాట్లాడుతుండటం వలన ప్రజలు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని పోగొట్టుకొంటున్నామని, తెదేపాకి చాలా నష్టం జరుగుతోందని ముఖ్యమంత్రికి కూడా తెలుసు. కానీ వేరే మార్గం కనబడకపోవడంతో ఆయన అదే పద్దతిలో రెండేళ్లుగా ముందుకు సాగిపోతున్నారు.
నిన్న కృష్ణానది వద్ద హారతి కార్యక్రమం తరువాత అయన కృష్ణమ్మ సాక్షిగా విభజన చట్టంలోఇచ్చిన హామీలనన్నిటినీ అమలయ్యే వరకు కేంద్రప్రభుత్వంతో పోరాడుతానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అటువంటి ప్రతిజ్ఞలు చేయడం వలన ఆయన ఇంకా ఆ ఊబిలో కూరుకుపోతారే తప్ప దాని నుంచి ఎప్పటికీ బయటపడలేరని చెప్పవచ్చు. పైగా ‘కృష్ణమ్మ సాక్షిగా చేసిన ఆ ప్రతిజ్ఞ’ కూడా ప్రతిపక్షాలకి మరొక ఆయుధంగా అందించినట్లవుతుంది.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు తన పార్టీకి నష్టం కలగకుండా రక్షించుకొనేందుకు ఏదో దీర్గకాలిక వ్యూహంతోనే ముందుకు సాగుతుండవచ్చు. కానీ పార్టీ కోసం, తమ నేతల స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని కూడా తాకట్టు పెడుతున్నారనే వైకాపా ఆరోపణలే ప్రజలకు బాగా చేరుతున్నాయనే సంగతి ఆయన గుర్తించడం కూడా చాలా ముఖ్యం.
నిజానికి ఏపికి ప్రత్యేక హోదా వగైరా హామీలన్నీ అమలయ్యి ఉండి ఉంటే శరవేగంగా రాష్ట్రాభివృద్ధి చేయగలిగి ఉండేవారు. అప్పుడు ఆ క్రెడిట్ ఆయనకే దక్కి ఉండేది. దాని వలన రాష్ట్రానికి మేలు కలగడమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకి, తెదేపాకి కూడా ప్రజాధారణ చాలా పెరిగి ఉండేది. కనుక ఆయన తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారనే ప్రతిపక్షాల వాదన సరికాదనే చెప్పవచ్చు. ఒకవేళ ఆయన స్థానంలో మరెవరున్నా, మరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఇదేవిధంగా వ్యవహరించక తప్పదు. కానీ కాంగ్రెస్, వైకాపాలు ప్రతిపక్షంలో ఉన్నాయి కనుక ఏమైనా మాట్లాడగలవు. ఏమైనా డిమాండ్ చేయగలవు.
వాటి విమర్శలని, ఆరోపణలని, డిమాండ్స్ ని ప్రభుత్వం పట్టించుకోకపోయినా వాటి వలన జరుగుతున్న నష్టాన్ని మాత్రం సరిగ్గా అంచనా వేయలేకపోయినా, ప్రజాభీష్టాన్ని గుర్తించలేకపోయినా శాపకారణంగా కర్ణుడికి కురుక్షేత్ర యుద్దంలో సమయానికి అస్త్రశస్త్రాలు పనిచేయనట్లే వచ్చే ఎన్నికల సమయంలో ఏ వ్యూహాలు పనిచేయకపోవచ్చు. కనుక ఇప్పటికైనా తెదేపా-భాజపాలు తమలో తాము కీచులాడుకోవడం మానుకొని రెండూ కలిసి ప్రజల ముందుకు వచ్చి వాస్తవ పరిస్థితులని వివరించి, రాష్ట్రాభివృద్ధికి తమ ప్రతిపాదనలని వారి ముందు ఉంచి నచ్చజెప్పితే మంచిది. లేకుంటే చివరికి వారే నష్టపోయే ప్రమాదం ఉంది.