ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రీడాకారుల మనో స్థైర్యం దెబ్బతినేలా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా శోభా డే మాట్లాడడం ముమ్మాటికీ తప్పే. అందులో సందేహమే లేదు. అందుకే అమితాబ్ బచ్చన్‌తో సహా బోలెడు మంది బడా బడా మనుషులతో పాటు సోషల్ మీడియా జీవులు కూడా…‘యస్…మేం ఓ తప్పు మాటను పట్టేశాం..’ అన్న ఆనందంలో శోభా డేను పిచ్చి తిట్లు తిట్టేస్తున్నారు. అయితే తిట్టేవాళ్ళకు శోభాడేకు తేడా ఏంటో మాత్రం అర్థం కావడం లేదు. శోభా డేను విమర్శిస్తున్న సెలబ్రిటీస్ అందరూ కూడా చేస్తోంది ఒక్కటే. సింధు విజయంలో కొంచెం క్రెడిట్ కోసం ట్రై చేస్తున్నారు. లేకపోతే మేం చాలా గొప్పవాళ్ళం…అందుకే విజయం సాధించిన వాళ్ళను అభినందించడానికి ముందుకొచ్చాం, మా గొప్పతనాన్ని గుర్తించండి అన్న భావనను వ్యక్తపరుస్తున్నారు.
మోడీ, కెసీఆర్, చంద్రబాబు, అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, జగన్ మోహన్ రెడ్డి….ఇంకా బోలెడు మంది పెద్దవాళ్ళందరూ సింధును అభినందించారు. ప్రెస్ మీట్ పెట్టి అభినందించడం కష్టం కానీ ట్వీట్ చేయడం, ఓ ప్రెస్ నోట్ పంపించడం చాలా ఈజీనేగా. అయితే ఏ ఒక్కరూ కూడా చేతల్లో మాత్రం ఏం చేయడానికి కూడా సిద్ధంగా లేనట్టున్నారు. ముఖ్యమంత్రుల స్థానంలో కూర్చుని ఉన్న చంద్రబాబు, కెసీఆర్‌లు కూడా మాటలే చెప్పారు ఎందుకనో. సింధు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలంటే ఈ ఒట్టి మాటలు అస్సలు సరిపోవు. ఇంతకుముందు చిన్న చిన్న విజయాలకే కోటి రూపాయలు సమర్పించుకున్న చరిత్ర మన పాలకులది. మరి ఈ సారి ఎందుకనో అలాంటి స్పందన రాలేదు. సింధు, గోపీచంద్‌ల కష్టం చూస్తుంటే ఎవ్వరి హృదయమైనా స్పందించాల్సిందే. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మన ప్రభుత్వాలు కూడా ఇవ్వాలని కోరుకుందాం. అప్పుడే వీళ్ళ అబినందనలకు అర్థం ఉంటుంది. అలా కాకుండా కేవలం మాటలతో సరిపెట్టేస్తే మాత్రం సింధును శోభా డే కంటే కూడా వీళ్ళే ఎక్కువ అవమానించినట్టు.