ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు తుది దశకి చేరుకొంటున్నాయి. పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా పర్యవేక్షిస్తూ వేగంగా పనులు పూర్తి చేయిస్తున్నారు. ప్రస్తుతం అన్ని బ్లాకులలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఫర్నీచర్, ఏసీ, త్రాగునీరు వగైరా సకల సదుపాయాలూ కల్పిస్తున్నారు. ఇంకా టెలీఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించవలసి ఉంది. అది కూడా త్వరలోనే ఏర్పాటవుతుంది. సచివాలయం బయట తారురోడ్ల నిర్మాణం జరుగుతోంది. దానితో బాటే డ్రైనేజ్, గ్రీనరీ డెవలప్మెంట్, వీధి దీపాలు, కార్ పార్కింగ్ వగైరా పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
ఈ నెల 24తో కృష్ణా పుష్కరాలు ముగుస్తాయి కనుక ఇంతవరకు ఆ పనులలో నిమగ్నమయున్న వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ మళ్ళీ తరలివస్తే అప్పుడు పనులు ఇంకా వేగం పుంజుకొని త్వరలోనే తాత్కాలిక సచివాలయం అందుబాటులోకి వస్తుంది. కనుక హైదరాబాద్ లో ఉన్న అధికారులు, ఉద్యోగులు కూడా తరలివచ్చే సమయం దగ్గర పడినట్లే భావించవచ్చు. బహుశః దసరా నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన మొదలయ్యే అవకాశం చాలా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయమే.
అయితే తాత్కాలిక సచివాలయాన్ని 6 నెలలోగా నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలనే షరతుల గురించి ఇక్కడ మాట్లాడుకోక తప్పదు. ఆరు నెలలలో పూర్తి చేసి ఇచ్చినట్లయితే రెండు నిర్మాణ కంపెనీలకి బోనస్, ఆ గడువు దాటితే జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంటులోనే పేర్కొంది. అందుకు ఆ రెండు సంస్థలు అంగీకరించే పని మొదలుపెట్టాయి. కానీ వాటికిచ్చిన గడువు (జూన్ 15) ఎప్పుడో ముగిసిపోయింది. కనుక వాటిపై ఒప్పందం ప్రకారం ప్రభుత్వం జరిమానా విదిస్తుందా? అంటే విదించకపోవచ్చనే చెప్పవచ్చు. ఎందుకంటే మొదట జి+1 భవనాల నిర్మాణానికే ఒప్పందం చేసుకొన్నాయి. కానీ ఆ తరువాత, కమీషనరేట్ కార్యాలయాలు కూడా అదే భవనంలో ఉంటే ఖర్చు, సమయం అన్నీ కలిసివస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మరో మూడు అంతస్తులు అదనంగా నిర్మించే బాధ్యత కూడా వాటికే అప్పగించింది. కనుక ముందు అనుకొన్నట్లుగా సచివాలయాన్ని సకాలంలో పూర్తి చేసి అప్పగించకపోయినా వాటిపై జరిమానా విదించకపోవచ్చు.
అదేవిధంగా ఆరు నెలలోనే నిర్మించి ఇచ్చేందుకు వాటికి ప్రభుత్వం అదనంగా ముట్టజెప్పిన డబ్బు కూడా వెనక్కి తిరిగి రాకపోవచ్చు. అంటే సచివాలయ నిర్మాణం కూడా సాధారణంగా ఇతర భవంతుల నిర్మాణానికి పట్టే సమయంలోనే నిర్మిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయినా ప్రభుత్వం తొందరపాటు వలన రెండు నిర్మాణసంస్థలు లాభపడ్డాయని చెప్పవచ్చు. అదే సాధారణ పద్దతిలోనే టెండర్లు పిలిచి సచివాలయం నిర్మాణానికి 12నెలల సమయం ఇచ్చి ఉండి ఉంటే ఖజానాకి నష్టం ఉండేది కాదు. హైదరాబాద్ లో ఉద్యోగులకి అవస్తఃలు తప్పేవి. ప్రభుత్వానికి ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా!