తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకొనే ముందు ప్రతిపక్షాలని కూడా సంప్రదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి అఖిలపక్షసమావేశం నిర్వహించబోతున్నారు. ఒక్క వైకాపాని తప్ప రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీలని ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు సంఖ్య, వాటి హద్దులు తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకొన్నారు. దసరా పండుగ రోజు నుంచి కొత్త జిల్లాలు పనిచేయడం పనిచేస్తాయని స్పష్టం చేశారు కూడా. కనుక ఈ సమావేశం కేవలం లాంచనప్రాయంగా ప్రతిపక్షాలని తృప్తిపరచడానికి నిర్వహిస్తున్నదేనని భావించవచ్చు.
ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించి కొత్త జిల్లాలని అధికారికంగా ప్రకటించడానికి తెరాస ప్రభుత్వం సిద్దం అవుతుంటే, మరోపక్క జనగామ, సిరిసిల్లాలని జిల్లాలుగా ప్రకటించాలని కోరుతూ ఆ రెండు ప్రాంతాలలో బంద్ జరుగుతోంది. ఆ కారణంగా దుఖాణాలు, విద్యా సంస్థలు, సినిమా హాళ్ళు అన్నీ బంద్ పాటిస్తున్నాయి. సిరిసిల్లాలో కెసిఆర్, కెటిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇక కరీంనగర్ జిల్లాలో ఇందుకు పూర్తి భిన్నమైన కారణంతో బంద్ జరుగుతోంది. జిల్లాలో హుస్నాబాద్, కోహేడ్ మండలాలని కొత్తగా ఏర్పాటు చేస్తున్న సిద్ధిపేట జిల్లాలో కలపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతోంది.
ఈరోజు అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్, తెదేపా, భాజపాలు కెసిఆర్ ప్రతిపాదనలు తమకి ఆమోదయోగ్యం కావని ముందే తేల్చి చెప్పాయి. కనుక ఈ సమావేశం తరువాత ఏమి జరుగబోతోందో అనే ఉత్కంట నెలకొని ఉంది.