ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభలకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ రెంటిలో యూపి చాలా పెద్ద రాష్ట్రం కనుక ఆ ఎన్నికలని అన్ని పార్టీలు చాలా కీలకంగా భావిస్తున్నాయి. సుమారు 27సం.లుగా ఆ రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఇంకా ముఖ్యమైనవి. ఒకవేళ ఈసారి కూడా ఎన్నికలలో ఓడిపోయినట్లయితే, ఇక ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరెన్నటికీ కోలుకోలేదు. కనుకనే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ చేతిలో పార్టీని పెట్టి, దానిని గెలిపించే బాధ్యత లేదా భారం ఆయనకే అప్పగించేసింది.
రాజకీయ పార్టీలని ఎన్నికలలో గెలిపించే ‘అవుట్ సోర్సింగ్ బిజినెస్’ లో ఇప్పటికే ఆయన చాలా రాణించారు. ఇంకా రాణించాలనుకొంటున్నారు. కనుక యూపిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే వర్క్ ని టేకప్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన చెప్పినట్లుగానే ఈసారి బ్రాహ్మణ కార్డులతో ఈ ఎన్నికల గేమ్ మొదలుపెట్టింది. బ్రాహ్మణ కులానికి చెందిన షీలా దీక్షిత్ ని తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి, బ్రాహ్మణులకి 100 టికెట్స్ కేటాయించడానికి సిద్దం అవుతోంది. ఆయన సూచన ప్రకారమే ఈ ఎన్నికలలో రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంకా వాద్రాతో ప్రచారం చేయించడానికి సిద్దం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ అయినా రాహుల్ గాంధీ భవిష్యత్ దృష్ట్యా దానిని అధికారికంగా ప్రకటించకపోవచ్చు.
కనుక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ రధసారధి ఎవరైనప్పట్టికీ, ఒకవేళ గెలిస్తే ఆ క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ కే దక్కుతుందని చెప్పవచ్చు. అదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ ఆయనకి పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇచ్చి, మిగిలిన రాష్ట్రాలని కూడా ఆయనకే అప్పగించే అవకాశం ఉంటుంది. యూపిలో గెలిస్తే ఆయనకి చాలా డిమాండ్ పెరుగుతుంది కనుక అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో లేదో గ్యారంటీ ఉండదు. ఒకవేళ ఆయన వేరే రాష్ట్రాల ఎన్నికలలో భాజపాతో కాంట్రాక్ట్ సైన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దెబ్బయిపోతుంది.
రాహుల్ గాంధీ వల్ల కాని పనిని ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు కనుక ఆయనని కట్టి పడేసుకోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ నే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా నియమించుకొంటే కాంగ్రెస్ లో పది ఉంటారు. అప్పుడు ఇంక రాహుల్ గాంధీ నిశ్చింతగా విదేశాలు తిరిగి వస్తుండవచ్చు లేదా లోక్ సభలో మొహమాటపడకుండా హాయిగా గుర్రుపెట్టి పడుకోవచ్చు కూడా. ప్రశాంత్ కిషోర్ ఇస్తున్న అన్ని సూచనలని తూచాతప్పకుండా పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన ఈ సూచన కూడా ఇస్తే అది తప్పకుండా ఆలోచించవచ్చు.