ఈరోజు విజయవాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో సెప్టెంబర్ 6 నుంచి వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వేలగాపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో శాసనసభ సమావేశాల నిర్వహణకి అవసరమైన ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా హైదరాబాద్ లోనే సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన జి.ఎస్.టి.బిల్లుకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడానికి దేశంలో కనీసం సగం రాష్ట్రాలు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేయవలసిఉంటుంది. కనుక తక్షణమే శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుకి అనుకూలంగా తీర్మానాలు చేసి పంపమని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు వ్రాశారు. ఈ నెలాఖరులోగానే తెలంగాణా ప్రభుత్వం కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసి పంపిస్తుందని మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 6నుంచి సమావేశాలు నిర్వహించి ఆ బిల్లుకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసి పంపిస్తుంది.
ఈ సమావేశాలు ప్రధానంగా జి.ఎస్.టి.బిల్లు కోసమే అయినప్పటికీ వారం రోజుల పాటు సమావేశాలు సాగుతాయి కనుక ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఆర్ధిక ప్యాకేజి వంటి హామీల అమలుపై తెదేపా-వైకాపాల మద్య తీవ్ర వాగ్వాదాలు జరుగవచ్చు. కృష్ణా పుష్కరాలు ముగిసిన తరువాత ఈ విషయాల గురించి మాట్లాడుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కనుక ఒకవేళ అసెంబ్లీ సమావేశాలలోగా ఏదైనా గట్టి నిర్ణయం తీసుకొంటే వైకాపా విమర్శల నుంచి తప్పించుకోగలుగుతారు లేకుంటే ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామాల కోసం వైకాపా శాసనసభలో తెదేపాపై గట్టిగా ఒత్తిడి చేయవచ్చు.