సినిమా రంగం మౌలికంగా వందల కోట్ల వ్యాపారంతో ముడిపడిన రంగమని అందరికీ తెలుసు. చెప్పాలంటే వినోదం ఇప్పుడు అతి ఖరీదైన వ్యాపారం తప్ప కళ కాకరకాయ ఆ తర్వాతే!అయితే ఇప్పుడు హిందీ తారలతో టివీ ఛానల్స్ కుదుర్చుకునే ఒప్పందాలు మరీ వూహకందని స్తాయిలో వున్నాయిే. సల్మాన్‌ఖాన్‌తో స్టార్ టీవీ 2013లో కుదర్చుకున్న ఒప్పందం విలువ రు.500 కోట్లు . దీని గడువు 2017 డిసెంబర్ వరకూ వున్నా ఈ మధ్య తిరగరాసుకున్న విలువ వెయ్యి కోట్టు మాత్రమే! కాకపోతే ఈ ఒప్పందం ప్రకారం సల్మాన్ సినిమాల శాటిలైట్ హక్కులు స్టార్కే విక్రయించాల్సి వుంటుంది. ప్రస్తుతం సల్మాన్ నటించే మరో పది చిత్రాలు కూడా స్టార్కే వెళ్లాల్సి వుంటుంది. దాంతో పాటు ఆ ఛానల్లో అడపాదడపా కనిపిస్తుండాలి.
అయితే చిక్కు ఎక్కడ వచ్చిందంటే సుల్తాన్ చిత్రం నిర్మించిన ఆదిత్య చోప్రా తమ సినిమాలన్నీ ఇంతవరకూ సోనీ కే ఇస్తున్నారు. కనుక సల్మాన్ ఒప్పందం మేరకు స్టార్‌కు చిత్రం హక్కులు విక్రయించడానికి సిద్ధంగాలేదట. ఈ విషయమై స్టార్ ఏమీ మాట్లాడ్డం లేదు గాని ఏదో ఒక పరిష్కారానికి వస్తారనే అనుకోవాలి. ఇంకా చూస్తే హృతిక్ రోషన్ 550 కోట్లతో, అజరు దేవ్గన్ 400 కోట్లతో వరుణ్‌దావన్ 300 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నారట. వారందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.ఈ విధంగా ముందే డీల్స్ కుదర్చుకోవడం వల్ల ఉపయోగం ఏమంటే ఛానళ్లకు హిట్ చిత్రాల ప్రసార హక్కులు లభిస్తే స్టార్లకు భారీ మొత్తాలు ముడుతుంటాయిటీవీల నుంచి హీరోలకు వచ్చే మొత్తాలే ఇంత భారీగా వుంటే లాభాలు ఖర్చులు ఏ మోతాదులో వుంటాయో వూహించవలసిందే.. ఇంత డబ్బు మయమైన పరిశ్రమలో సమాజం సందేశం అంటూ నస పెడితే ఎక్కడో అరుదుగా తప్ప పట్టించుకునే పరస్థితి ఎక్కడుంటుంది? ఈ చిత్రాలు ఇంత మొత్తాలు పెట్టి తీసుకోవడమెందుకంటే వాటిమధ్యలో భారీతా యాడ్లు జొప్పించడానికేనని వేరే చెప్పాలా!