ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వాన్ని, ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే నిందించడం అందరూ చూస్తూనే ఉన్నారు.ఆ విషయంలో చంద్రబాబుకి కూడా చాలా బాధ్యత ఉనప్పటికీ, దానిని మంజూరు చేయగల అధికారం, చేయవలసిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదేనని వాటికీ తెలుసు. కానీ ప్రత్యేక హోదా అనేది ప్రతిపక్షాలకి ఒక బలమైన రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకొంటున్నాయి కనుక అవి చంద్రబాబు నాయుడుపైనే దానిని ప్రయోగించి లాభపడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పుడు తెదేపాలో మంచి నోరున్న నేతగా పేరొందిన గాలి ముద్దు కృష్ణంనాయుడు వంటివాళ్ళు ముందుకు వచ్చి కౌంటర్ ఇస్తుంటారు.ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన ముష్టి నిధులపై తెదేపా-భాజపాల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యింది కనుక మళ్ళీ గాలి జోక్యం చేసుకొని నోరు విప్పక తప్పలేదు.
“రాష్ట్ర విభజన మేము కోరుకోలేదు. కాంగ్రెస్, భాజపాలు రెండూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కి ఈ దుస్థితి కల్పించాయి. అప్పుడు ఏపికి అన్యాయం జరుగుతోంది కనుక ప్రత్యేక హోదా ఇవ్వాలని భాజపా పట్టుబట్టింది. అందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. ఇప్పుడు భాజపాయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ మాట తప్పుతోంది. అప్పుడు ప్రత్యేక హోదా చాలా అవసరమని వాదించి ఇప్పుడు అవసరమే లేదన్నట్లుగా మాట్లాడితే ఎలాగ? కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.8379 కోట్లతో రాజధానిలో రోడ్లు, కేబుల్స్ వేయడానికి కూడా సరిపోవు. ఇంకా రాజధాని ఎప్పుడు ఏవిధంగా నిర్మించుకోగలము? కాంగ్రెస్ పార్టీ లాగే భాజపా కూడా తన విశ్వసనీయతని పోగొట్టుకొంటే మళ్ళీ దానిని పొందడం చాలా కష్టం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా పాపాలు చేసి చేజేతులా ఈ దుస్థితి తెచ్చుకొంది. భాజపా కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను కోరుతున్నాను,” అని అన్నారు.
ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కనుక తెదేపా నేతలు ఈవిధంగా ఏదో ఓ పార్టీని అడిపోసుకొంటూ కాలక్షేపం చేస్తూ తప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎన్నికల సమయంలో ఇటువంటి వాదనలని ప్రజలు ఆమోదించకపోతే భాజపాతో బాటు తెదేపా కూడా నష్టపోవడం తధ్యం. కనుక తెదేపా కూడా తన విశ్వసనీయతని కాపాడుకొనే ప్రయత్నం చేయడం మంచిది.