రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కొత్త గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. అదే రోజున ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన రఘురాం రాజన్ తో చాలా సన్నిహితంగా పనిచేసి అనేక సంస్కరణలను అమలుచేశారు. కనుక ఆయన కూడా ఇంచుమించు రాజన్ మార్గంలోనే పయనించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ ఉర్జిత్ పటేల్ పై కూడా విమర్శలు చేయకుండా ఊరుకోకపోవచ్చు. ఉర్జిత్ పటేల్ మూడేళ్ళు ఈ పదవిలో కొనసాగుతారు.
పదవీ విరమణ చేస్తున్న రఘురామ రాజన్ దేశవిదేశాలలో చాలా మంచి పేరు సంపాదించుకొన్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి నోటికి బలైపోయారు. సుబ్రహ్మణ్య స్వామి చేసే విమర్శలు, ఆరోపణలు భరించలేకనే ఆయన మరో మూడేళ్ళపాటు పదవీ కాలం పొడిగించమని కోరకుండా పదవీ విరమణ చేస్తున్నారు. భారత ఆర్ధిక వ్యవస్థకి మూల స్థంభం వంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఈవిధంగా అవమానకర పరిస్థితులలో పదవీ విరమణ చేయవలసి రావడం చాలా బాధాకరమే.