హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టటం వెనక రహస్యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బయటపెట్టారు. ఆత్మహత్యలను నివారిస్తా, రైతాంగాన్ని ఆదుకుంటా, ప్రాణహిత్-చేవెళ్ళ పూర్తిచేస్తా…. అంటూ 180 అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ఎన్నికలలో గెలిచారని షబ్బీర్ చెప్పుకొచ్చారు. వికారాబాద్‌ను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న షబ్బీర్, కేసీఆర్ హామీల గురించి ఒక విశ్లేషణ చేశారు. ఇచ్చిన హామీలలో కేవలం మూడింటిని మాత్రమే కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. పద్దెనిమిదింటిని పాక్షికంగా అమలు చేశారని అన్నారు. ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పారని, కానీ అది సాధ్యంకాదని చెప్పారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నాడు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ తన ప్రాణమని చెప్పి, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రాణం తీస్తున్నాడని చెప్పారు. మొన్న కుటుంబ సర్వే, నిన్న మన ఊరు-మన ప్రణాళిక, ఇవాళ గ్రామజ్యోతి అని రోజుకో పథకం ప్రవేశపెడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలేమి చేయాలో ఎలా చేయాలో ఆయనకు అవగాహన లేదని అన్నారు.