రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఉన్నత విద్యా సంస్థలలో కొన్నిటికీ ఇప్పటికే శంఖుస్థాపనలు జరిగాయి. తాడేపల్లిగూడెంలో రేపు ఉదయం 9.30 గంటలకు నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజి ‘నిట్’ కు కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ శంఖుస్థాపన చేస్తారు. ఆమెతో బాటు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారు. ఇదివరకు విశాఖలో ఐ.ఐ.ఎం., తిరుపతిలో ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఐ.ఐ.టి.) చిత్తూరు జిల్లాలో ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐ.ఐ.యస్.ఈ.ఆర్.), ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.ఐ.ఐ.టి.) లకు స్మృతీ ఇరానీయే శంఖుస్థాపన చేసారు. వాటికి శాశ్విత భవనాలు నిర్మించబడే వరకు తాత్కాలికంగా ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో శిక్షణా తరగతులు నిర్వహించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు తాడేపల్లిగూడెంలో శంఖుస్థాపన చేయబోయే ‘నిట్’ తరగతులు కూడా ఈ విద్యా సంవత్సరం నుండే ఆరంభించబోతున్నారు.