మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలోకి జంప్ చేస్తూ “ఏడాదిగా ఎంత కృషి చేసినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. అందుకే పార్టీ వీడుతున్నాను,” అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన మల్లాది విష్ణు కూడా అదే కారణం చెపుతూ వైకాపాలోకి వెళ్లిపోయేందుకు మూట ముల్లె సర్దుకొని సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కాంగ్రెస్ జెండా, అజెండా, టోపీ, కండువా అన్నీ పక్కన పడేసి, వైకాపా కండువాకప్పుకొనేందుకు ఎదురుచూస్తున్నారని సమాచారం. ఆయనకు చాలా కాలంగా వైకాపా నేతలతో, జగన్మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలున్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి ఆయన చేరికకు సానుకూలంగానే ఉన్నారని సమాచారం. కనుక ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే ఆలశ్యం. మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుండి జంప్ అయిపోతే పార్టీకి గట్టి దెబ్బే తగులుతుంది. బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలనే ఆయన కూడా వల్లిస్తున్నారు కనుక బహుశః బోత్సే ఆయనని వైకాపాలో చేరేందుకు ప్రోత్సహించారేమో అనే అనుమానం కలుగుతోంది.