తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటుచేసిన తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొట్టమొదటి ఉద్యోగ నోటిఫికేషన్ బుదవారం విడుదలయ్యింది. మొదటి విడతలో వివిధ ప్రభుత్వ శాఖలలో 770మంది సివిల్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలయింది. మరొక విశేషం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి 44సం.లుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వచ్చే నెల 20న వ్రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్నులయిన వారికి ఆ తరువాత వెంటనే ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్నులకు నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాలలోకి తీసుకొంటారు. ఈ పోస్టుల భర్తీకి పరీక్ష వివరాలు వగైరా అన్నీ కమీషన్ తాలూకు వెబ్ సైట్ లో పెట్టామని చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. దీని తరువాత గ్రూప్-2 పోస్టుల భర్తీకి అక్టోబరులో, గ్రూప్-1కి డిశంబరులో నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిశంబర్ నాటికి మొత్తం 3,783 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్ లో వివిధ శాఖలలో భర్తీ చేయబోయే స్థానాలు ఈవిధంగా ఉన్నాయి. ఆర్.డబ్ల్యు.ఎస్-418 పోస్టులు, నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి-143, పబ్లిక్ హెల్త్ అండ్ మునిసిపల్ ఇంజనీరింగ్-121, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 83, మున్సిపల్-5 పోస్టులు కలిపి మొత్తం 770 పోస్టులను మొదటి దశలో భర్తీ చేయబోతున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు.